Pavan Kalyan: పిఠాపురంలో టీడీపీ నేత వర్మకు మరో షాక్ తగిలిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేసి విజయం సాధించారు. పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో స్థానిక టీడీపీ నేత వర్మ తన సీటును త్యాగం చేసి మరీ పవన్ గెలుపుకు కృషి చేశారు. పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి దూరంగా ఉన్నప్పటికీ ఆయన గెలుపు కోసం వర్మ విసృతంగా ప్రచారం నిర్వహించారు. పవన్ సైతం తన గెలుపును వర్మ చేతుల్లో పెడుతున్నాంటూ వ్యాఖ్యానించారు. అయితే పవన్ గెలిచిన తర్వాత ఎక్కడ కూడా వర్మ పేరు ప్రస్తావించకపోవడంతో టీడీపీ శ్రేణులు ఆయనపై గుర్రుగా ఉన్నాయి.
ఇదే సమయంలో టీడీపీ నేత వర్మపై జనసేన కార్యకర్తలు దాడి చేయడం సంచలనంగా మారింది. కూటమి గెలిచిన కొద్ది రోజులకే పార్టీల మధ్య విభేదాలు బయటపడ్డాయి. జనసేనకు చెందిన కొందరు కార్యకర్తలు టీడీపీ నేత వర్మపై దాడికి దిగారు. ఈ దాడిలో మాజీ ఎమ్మెల్యే వర్మ కారు పూర్తిగా ధ్వంసమైంది. వర్మ త్యాగానికి సరైన ప్రతిఫలమే ఇచ్చారంటూ టీడీపీ నాయకులు వాపోయారు. ఈ ఘటనతో టీడీపీ, జనసేన మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇక వర్మ కు అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదని టీడీనీ క్యాడర్ అసంతృప్తితో రగిలిపోతుంది.
ఇక చంద్రబాబు సైతం వర్మకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదనిపిస్తోంది. పవన్ కల్యాణ్ కోసం వర్మ తన సీటును త్యాగం చేయడంతో , అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి ఆయన్ను మంత్రిని చేస్తానని చంద్రబాబు అప్పట్లో హామీ ఇచ్చారు.అయితే ఈ హామీని అమలు చేయడంలో చంద్రబాబు అలసత్వం చూపిస్తోన్నట్టుగా కనిపిస్తోంది.మొదటి ఎమ్మెల్సీ సీటు అవకాశం దాటిపోయింది. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్యారంటీగా గెలిచే సీటును సైతం వర్మకు కాకుండా మరో నేతకు ఇవ్వడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారు.
గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పిఠాపురం వర్మకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. ఇక్కడి నుంచి కాపు లేదా ఎస్సీ అభ్యర్థిని పెట్టాలని ప్లాన్ చేసినట్టుగా ఒక ప్రచారం సాగించారు. కెఎస్ జవహర్ వంటి పేర్లను కూడా పరిశీలించి.. చివరకు పేరాబత్తుల రాజశేఖర్‌కు టికెట్ ప్రకటించబోతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో మరోసారి వర్మకు నిరాశే ఎదురైంది. దీనిపై వర్మ అనుచరులు రగిలిపోతున్నారు. అసలు పిఠాపురంలో పవన్‌కు అవకాశం ఇచ్చి తప్పు చేశామనే భావనలో వర్మ వర్గం ఉంది. మరి వర్మను శాంతపరచడానికి చంద్రబాబు ఎలాంటి ప్రణాళికలతో ముందుకొస్తారో చూడాలి.