తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం తయారీ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు ఉపయోగించారని అర్థంపర్థం లేని ఆరోపణలు చేయడం కోట్లాది శ్రీవారి భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇప్పటికే ప్రసాదం తయారీలో వినియోగించిన ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్‌లు కల్తీ అయినట్లు మాత్రమే తేలిందని, ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని ఎన్‌డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు) నివేదిక కూడా ఇచ్చింది. మరోవైపు.. టీటీడీ ఛైర్మన్లుగా పని చేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలు సైతం ఈ విషయంపై స్పందించి అలాంటి తప్పు జరిగే అవకాశమే లేదని అన్నారు. ఈ మేరకు తీవ్ర విమర్శలు చేస్తూ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదంపై చంద్రబాబు ఇలా వ్యాఖ్యానించడం ఏ మాత్రం సరికాదని తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ శ్రేణులు, నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రాజకీయ లబ్ధి, స్వార్థం కోసం దేవుడిని సైతం వాడుకుని చంద్రబాబు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడని, అలాంటి ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని విమర్శించారు. గతంలో రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్రయోగించారని గుర్తు చేశారు. ఆ సమయంలో భగవంతుడు శిక్షించాడు కనకే.. రాజశేఖర్ రెడ్డికి ఆ గతి పట్టిందని చంద్రబాబు అనడం గుర్తుండే ఉంటుంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఫోకస్ పెట్టారని.. లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. చివరకు స్వామివారి ప్రసాదాలపై సైతం దుష్ప్రచారం చేయడం దారుణమని భూమన మండిపడ్డారు.