Sridhar babu:తెలంగాణ కేబినెట్ లో ఒక్కొక్కరిదీ ఒక్కో శైలి. అయితే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుది మాత్రం ప్రత్యేకం. దుద్దిళ్ల శ్రీపాదరావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన శ్రీధర్ బాబు తనకంటూ మంచి ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన ఇమేజ్ ను చెడగొడుతోంది. వివాదాస్పద నిర్ణయాలు, ఘటనలపై ఆయనతో మాట్లాడిస్తోంది. క్లీన్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయనను ట్రబుల్ ష్యూటర్ గా వినియోగించుకుంటోంది. ఈ క్రమంలో ఆయన నోటి నుంచి వస్తున్న మాటలు వివాదాస్పదమవుతున్నాయి. ఆయనను ఓ వివాదాస్పదుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే దీనిని ఆయన గమనిస్తున్నారో లేదో చూడాలి. ఇలానే దూకుడుగా కొనసాగితే ఆయనకు నష్టం తప్పదని అనుచరులు తెగ బాధపడుతున్నారు.
శ్రీపాదరావు నక్సలైట్ల దాడిలో మరణించడంతో ఆయన తనయుడు శ్రీధర్ బాబు చిన్నవయస్సులోనే రాజకీయాల్లోకి వచ్చారు. వరుసగా మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రి వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినా ఆయన స్వంతంగా బలమైన నేతగా ఎదిగారు. 2009లో మూడోసారి విజయం సాధించగానే ఆయనకు వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా అవకాశం లభించింది. తర్వాత కిరణ్ హయాంలోనూ మంత్రిగా పనిచేశారు.బీఆర్ఎస్ హయాంలో ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్ తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి తర్వాత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగిన టాపిక్స్‌లో నెక్ట్స్ ఐటీ మినిస్టర్ ఎవరన్నది ఒకటి. ప్రముఖంగా చాలా మంది పేర్లు వినిపించినా మొదటి నుంచి అంతా దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకే ఈ శాఖ కేటాయిస్తారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కేటీఆర్ స్థానాన్ని ఆయన రీప్లేస్ చేస్తేనే బాగుంటదన్న కామెంట్స్ ఐటీ ఉద్యోగుల నుంచి కూడా వినిపించింది. చివరికి అందరూ ఊహించిందే జరిగింది. దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు ఐటీ, పరిశ్రమలు , శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్.
ఎవరు అవునన్నా.. కాదన్నా శ్రీధర్ బాబు వ్యక్తిత్వాన్ని.. రాజకీయ నాయకుడిగా మిగిలినవారికి భిన్నంగా ఆయన శైలి ఉంటుంది. వివాదాస్పద అంశాలకు.. తీవ్రమైన ఆరోపణలకు దూరంగా ఉంటారు.రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయన్ను ఒక మాట అనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడే పరిస్థితి. అలాంటి శ్రీధర్ బాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఏ మాత్రం సూట్ అయ్యేలా లేవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆదివారం మాదాపూర్ లోని ఒక స్టార్ హోటల్లో సీఎల్పీ నిర్వహించిన టీపీసీసీ అధ్యక్షుడి సన్మాన కార్యక్రమంలో పార్టీ నేతలంతా పాల్గొనటం.. ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడటం తెలిసిందే. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అమెరికా పర్యటనలో ఉన్నకారణంగా హాజరు కాలేదు. మంత్రిసీతక్క వ్యక్తిగత కారణాలతో రాలేదు. ఖమ్మం జిల్లాకు చెందిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు. వీరితో పాటు ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి ఫిరాయింపులకు పాల్పడిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో పాటు.. మొదట్లోనే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి.. కడియం శ్రీహరి లాంటి వారుసైతం హాజరయ్యారు.
సీఎల్పీ సమావేశానికి గాంధీ హాజరుకావటంపై మంత్రి శ్రీధర్ బాబునుమీడియా ప్రశ్నించినప్పుడు..ఆయన సీఎల్పీ బేటీలో పాల్గొన్నట్లు మీరు చూశారా?’’ అని ప్రశ్నించారు. తాము నిర్వహించిన సమావేశం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో జరగటంతో స్థానిక ఎమ్మెల్యే గాంధీ ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసేందుకు వచ్చారన్నారు. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో సిద్దిపేటకు వెళితే హరీశ్ రావు వెళ్లి కలవలేదా? అంటూ సంబంధం లేని వ్యాఖ్యలు చేసి పలుచన అయ్యారు. మిగిలిన నేతల సంగతి ఓకే. కానీ.. తనకంటూ ఒక మార్క్ ఉన్నశ్రీధర్ బాబు నుంచి ఈ తరహా వ్యాఖ్యలు ఊహించలేదన్న అభిప్రాయం పలువురి నుంచి వినిపిస్తుండటం గమనార్హం.