Andrapradesh floods: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకవైపు భారీ వర్షాలు, వరదలు ప్రజలను ముప్పతిప్పలు పెడుతుంటే.. అధికార యంత్రాంగం చేస్తున్న కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ప్రజలకు కనీస సహాయ సహకారాలు లేవని, కడుపు నిండా తిని రోజులు గడుస్తున్నాయని బాధితులు కన్నీరు పెడుతుంటే.. అసలే అలసత్వం ప్రదర్శిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు తలకు మించిన భారంగా తయారవుతున్నాయి. విజయవాడ భారీ వరదలపై ఏపీ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చకు దారి తీస్తోంది. బుడమేరు వరద విషయంలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభుత్వ చేతకానితనాన్ని స్పష్టం చేస్తున్నాయి. వరద వస్తుందని తమకు ముందే తెలుసని తాజాగా ఆర్పీ సిసోడియా అన్నారు. ‘మేము, మా ప్రభుత్వం అలర్ట్‌గానే ఉన్నామని చెబుతూనే.. దాదాపు 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యమని ఒప్పుకున్నారు. గోదావరి జిల్లాల్లో వరద వస్తుందని అక్కడి ప్రజలకు చెబితే మాకు తెలుసులే, ఇలాంటివి చాలా చూశామని అంటారని సిసోడియా చెప్పడం గమనార్హం.
ఇటీవల విజయవాడను బుడమేరు ముంచేసింది. దాంతో ఆ ప్రాంతం ఇంకా ఇప్పటికీ కోలుకోలేని స్థితికి చేరిన సంగతి తెలిసిందే. వరదలు మిగిల్చిన నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని చెబుతున్న క్రమంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు పెను దుమారం రేగుతోంది. బుడమేరుకు గండ్లు పడతాయని తెలుసు.. అందుకే మా ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని కూడా చెప్పడం మరో విశేషం. దీంతో ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే అని వైసీపీ విచురుకుపడుతుంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడం, వరద పరిస్థితులను అంచనా వేయలేకపోవడం, కష్టకాలంలో సైతం వైసీపీ తెచ్చిన వలంటీర్ వ్యవస్థను సరిగా వినియోగించుకోలేకపోవడం.. ఇవన్నీ ప్రభుత్వ వైఫల్యాలే అని చెబుతోంది. ఇదంతా ఇలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా గౌరవ పదవిలో ఉన్న సిసోడియా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఊహించలేదు అంటూ ప్రజలు సైతం మండిపడుతున్నారు. ప్రమాదం ముంచుకొస్తుందని తెలిసినప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాల్సింది పోయి.. 2 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేర్చడం సాధ్యం కాని పని అని ఒప్పుకోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా చిన్న విషయాన్ని పట్టుకుని వైసీపీపై రాద్ధాంతం చేసే టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుందని నిలదీస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని స్వయంగా ఒప్పుకుని.. ఇలాంటి సంచలన వ్యాఖ్యల ద్వారా ఏకంగా సీఎం చంద్రబాబుని ఇరికించినట్లు అయిందని తెలుస్తోంది.