Saturday, October 5, 2024

KCR: పదేళ్ల తప్పిదాలను సరిచేసుకునే పనిలో కేసీఆర్

- Advertisement -

KCR: కేసీఆర్ తీరు మార్చుకోనున్నారా? గతంలో జరిగిన తప్పిదాలను సరిచేసుకోనున్నారా? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులను తిరిగి అక్కున చేర్చుకోనున్నారా? బంగారు తెలంగాణ కోసం సమీకరించిన నేతల కంటే ఉద్యమకారులే మేలని భావిస్తున్నారా? వారిని వదులుకోవడంతోనే ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయని అంచనా వేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేపథ్యంలో ..ఇక ఉపేక్షిస్తే అవకాశం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారట. అందుకే త్వరలోనే కేసీఆర్ ప్రోగ్రాంకు సంబంధించి షెడ్యూల్ వెలువడుతుందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి … రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై జిల్లా పార్టీ అధ్యక్షులతో సుధీర్ఘంగా చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిసింది. తెలంగాణను సాధించిన ఉద్యమపార్టీగా టీఆర్ఎస్‌కు ప్రజల్లో ఆదరణ కనిపించింది. ఆ ఆదరణతోనే వరుసగా 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్‌గా రూపాంతరం చెందాక గతేడాది జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది.

కేసీఆర్ అప్పట్లో పాలనపైనే ప్రధానంగా ద్రుష్టిపెట్టేవారు. పార్టీపై ఫోకస్ చేసింది చాలా తక్కువ. అదే కొంపముంచినట్టు భావిస్తున్నారు. గత పదేళ్లు పార్టీపై ఫోకస్ పెట్టకపోవడం, గ్రామస్థాయి నుంచి బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం వల్లే ఓటమి పాలైనట్లు గులాబీ బాస్ ప్రాధమిక నిర్థారణకు వచ్చారు. అందుకే ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం చేపట్టేటప్పుడు యాగాలు, పూజలు నిర్వహించే కేసీఆర్.. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకుని పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారంట. అందుకే యాగం నిర్వహించారని చెప్తున్నారు . బీఆర్ఎస్‌ని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయడానికి పార్టీ అనుబంధ కమిటీలు, సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టబోతున్నారంట. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్న ఆయన. అందులో భాగంగానే తెలంగాణ భవన్ లో పార్టీ జిల్లా అధ్యక్షులతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ నెల11న కేసీఆర్ తెలంగాణ భవన్‌కు వస్తారంటున్నారు.

బీఆర్ఎస్ ప్రస్థానంలో తెలంగాణ ఉద్యమకారుల పాత్ర కీలకం. గతంలో ఉద్యమకారులకు పార్టీలో గుర్తింపు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. అలాంటి వారికి ఈసారి పార్టీ వేసే కమిటీల్లో ప్రాధాన్యత ఇచ్చి ప్రజల్లో, పార్టీ నేతల్లో ఉన్న అపోహలకు చెక్ పెట్టాలని కేసీఆర్ భావిస్తున్నారంట. ప్రస్తుతం ఉన్న పార్టీ అనుబంధ కమిటీలన్నీ రద్దు చేస్తారంట. అనుబంధ కమిటీలన్నీ యాక్టీవ్ గా పనిచేయకపోవడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలోనూ వెనుకబడటంపై కేసీఆర్ ఆగ్రహంతో ఉన్నారంట.పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలకు నూతన కార్యవర్గాలు ప్రకటించడానికి కేసీఆర్ కసరత్తు చేస్తున్నారంట. ఇప్పటివరకు జిల్లాల్లో పార్టీకి అధ్యక్షుడు ఒక్కరే ఉన్నారు … పార్టీలో పనిచేస్తున్న సీనియర్లంతా కమిటీల్లో చోటు కోసం ఎదురుచూస్తున్నారు. పార్టీలో గుర్తింపు కోసం ఏళ్లతరబడి ఎదురు చూస్తున్నారు. వారందరికీ కమిటీల్లో అవకాశం కల్పించాలని, పార్టీ కార్యక్రమాలను స్పీడ్ పెంచాలని పార్టీ అధ్యక్షుడు ఫిక్స్ అయ్యారంట

రాష్ట్రస్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించడానికి ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే సదరు తేదీలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ సమావేశంలో పార్టీ ఆధ్వర్యంలో చేపట్టబోయే కార్యక్రమాలు, కేడర్ ను బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించి అందుకు అనుగుణంగా కార్యచరణను ప్రకటిస్తారంటున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, దీంతో ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అయిందని, మరోవైపు ఆ పార్టీల్లోనే గ్రూపులు ఏర్పడ్డాయని ఇదే అదునుగా ప్రజల్లోకి వెళ్లాలని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద కేసీఆర్ యాక్టివ్ అవుతుండడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఖుషీ అవుతున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!