Pawan Kalyan: రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షకుడిగా పవన్ కళ్యాణ్ కొత్త అవతారం ఎత్తారు. ఆ హోదాలో ఉన్న వ్యక్తి అన్ని మతాలనూ సమానంగా చూస్తున్నట్టు కనపడాలి. తను ఏ మతానికి చెందినా, ఏ మతంపై ప్రత్యేక అభిమానం ఉన్నా దానిని బాహాటంగా తెలియజేయడం రాజ్యంగ పరంగా సెక్యులర్ స్ఫూర్తికి విరుద్ధం. తిరుమల లడ్డూ విషయంలో అందరి లాగానే పవన్ కూడా మనస్తాపం చెందారనుకుందాం. ఆ బాధతోనే ఆయన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి బెజవాడ కనకదుర్గమ్మ మెట్లు కడిగారు అనుకుందాం. గతంలో దుర్గమ్మ దేవాలయంలో క్షుద్ర పూజలు జరిగాయన్న వివాదంపై కూడా విచారించవలసిందిగా డిమాండ్ చేయవచ్చు కదా. గత పదేళ్లుగా అటు తెదేపా ప్రభుత్వంలోనూ ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలోనూ అమ్మవారి గుడిలో ఎన్నేసి అవినీతులు అక్రమాలు జరిగాయో విచారణ జరిపించవచ్చు కదా. దాని గురించి ఎందుకు ఆయన మౌనం వహించారు?
పవన్ కళ్యాణ్ దుర్గగుడి మెట్లు కడిగే సమయంలో అక్కడికి కూతవేటు దూరంలో వరదబాధిత ప్రజలు తమకు ఫ్లడ్ రిలీఫ్ అందలేదని రోడ్లపైకి వచ్చి గొడవచేసారు. పోలీసులు వారిని లాఠీ చార్జ్ చేసారు. పవన్ కళ్యాణ్ మెట్లు కడగడం అనే వార్త వల్ల ఆ వార్త సైడైపోయింది. ప్రజలకి సంక్షేమ పథకాలు అందడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలని ఇంత వరకు నెరవేర్చలేదు కూటమి ప్రభుత్వం. ప్రజలు గొంతెత్తి అడిగినా ఆ గొంతు వినపడకుండా మీడియా మొత్తం లడ్డూ ప్రసాదం వివాదం మోగుతుండాలి. “సనాతన ధర్మ పరిరక్షణ” పేరుతో ఒక బోర్డుని ఏర్పరచమని పవన్ కళ్యాణ్ తనకి అందుబాటులో ఉన్న మోడిని కానీ చంద్రబాబుని కానీ అడగగలరా? రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఆ బోర్డుకి అప్పజెప్పమని ప్రెజర్ చేయగలరా? అని ప్రజలు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నిస్తున్నారు. ఉపముఖ్యమంత్రిగా, ప్రధానికి ఆప్తుడిగా, ముఖ్యమంత్రికి సహచరుడిగా పవన్ కళ్యాణ్ ఈ ఒక్క పని చేయగలిగితే ఆయన దీక్షకి ఒక అర్థం పరమార్ధమనీ లేకపోతే 11 రోజులు సినిమాలోలా ఒక గెటప్పు వేసి తీసేసినట్టే అని ప్రజలు అంటున్నారు.
అసలు ల్యాబ్ రిపోర్ట్ లో ఉన్నదేంటి? “సస్పెక్టెడ్ అడల్టరేషన్” అంటే అనుమానాస్పద కల్తీ అని మాత్రమే. ఆ లిస్టులో కాటన్ సీడ్ ఆయిల్, సోయా బీన్ ఆయిల్, డాల్డా నుంచి ఈ జంతు కొవ్వుల దాకా పెద్ద లిస్టుంది. అంటే అవన్నీ ఉన్నాయని కాదు. అందులో ఏదో ఒకటి ఉండే అవకాశముందని. ఏవీ లేకపోయినా “ఫాల్స్ పాజిటివ్” వచ్చే అవకాశం ఉందని కూడా ఆ రిపోర్టే చెబుతోంది. టెస్టుకి పంపించిన నెయ్యిని పక్కన పెట్టేశామని ఆ నెయ్యి లడ్డూలకి ఉపయోగించలేదని టీటీడీ ఈవో శ్యామల రావు చెప్పినా సరే కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత అబద్ధపు ఆరోపణలు చేస్తుంది? లడ్డూలో కల్తీ జరిగిందో లేదో సీబీఐ చేత విచారణ జరిపించండి అని అందరూ కోరుతుంటే పవన్ కళ్యాణ్ దాని గురించి పెదవి విప్పడం లేదు ఎందుకు? కార్తీ చేత చేయని తప్పుకి క్షమాపణ చెప్పించుకోవడం వెనుక ఉన్న కారణం ఏంటి? ఈ అంశం పైన ప్రజలే కాదు సాక్ష్యాత్తు పవన్ ఫ్యాన్స్ కూడా ఆయన తప్పు చేసినట్లు భావిస్తుండటం గమనార్హం. డిప్యూటీ సీఎం వరకు ఎదిగి ఎంతో సాధించిన పవన్ ఒకే ఒక్క తప్పుతో అంతా పోగొట్టుకు౦టున్నాడని ఆయన ఫ్యాన్స్ మరియు జనసేన అనుచరులు సోషల్ మీడియా వేదికగా వారి బాధ వ్యక్త పరుస్తున్నారు.