AP Politics: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు దాటింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు నాయుడు ఈ సారి కొత్త ప్రయోగం చేశారు. ఏపీ కేబినెట్‌లో ఉన్న చాలా మంది మంత్రులు కొత్తవారే. అసలే సరిగా మొహాలు గుర్తు పట్టలేం అంటే.. మరోవైపు తమ పనీతీరుతో ఇంకా ప్రజల మనసుల్లో రిజిస్టర్ కాలేదు. అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి చేసుకున్నాం అని గొప్పగా చెప్పుకోవడమే తప్ప.. అసలు ఏపీలో మంత్రులు ఉన్నారా? ఉంటే ఎవరు ఉన్నారు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబుతో సహా మరో 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఇకపోతే.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేశ్ మరో ఇద్దరు, ముగ్గురు తప్పిస్తే మంత్రులు ఎవరన్నది జనాలకు తెలియని పరిస్థితి నెలకొంది. కొందరి విషయంలో అయితే ఏ మంత్రికి ఏ శాఖ అన్నది కూడా తెలియకుండా ఆశ్చర్యంగా ఉంది.
హోం మంత్రి వంగలపూడి అనిత, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తప్పితే మిగతా ఎవరి పేర్లు కూడా వినిపించడం లేదు. అటు జనసేన నుంచి మరో ముగ్గురు మంత్రులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఎలాగో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. పవన్ ఎలాగో హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. ఆయన తర్వాత జనసేన నుంచి వినిపించే మరో పేరు నాదెండ్ల మనోహర్. ఇక కూటమిలో మిగిలిన బీజేపీ నుంచి ఒకే ఒక్క మంత్రి.. సత్యకుమార్ అన్న సంగతి తెలిసిందే. ఇది తప్పితే ఏపీ కేబినెట్‌లో ఎవరు మంత్రి అన్నది గూగుల్ లోనే సెర్చ్ చేసి చూసుకోవాలని అంటున్నారు. మంత్రుల్లో అత్యధికులు కొత్తవారు.. పైగా శాఖల మీద పట్టు లేకపోవడం, ప్రజా సంక్షేమం కోసం చూపని చొరవ వల్ల కేవలం అందరూ పదవులకు పరిమితం అయ్యారు తప్ప.. జనాల మనస్సులో ఇంకా స్థానం సంపాదించలేదు అనే మాట ఒప్పుకోవాల్సిందే.