శ్రీకారం చుడుతున్నారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు పాదయాత్ర చేయడానికి ఆయన పూనుకున్నారు. రోజురోజుకు బలహీనపడుతూ, వైసీపీ కొడుతున్న దెబ్బలకు బక్కచిక్కిపోయిన తెలుగుదేశం పార్టీని మళ్లీ బలోపేతం చేయాలనేది లోకేష్ ప్రయత్నం. వయస్సురీత్యా తన తండ్రి వల్ల ఇక టీడీపీని లేపడం సాధ్యం కాదనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఇక లోకేష్ రంగంలోకి దిగారు. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర అంటే ఏపీ చరిత్రలోనే సుదీర్ఘ పాదయాత్రగా లోకేష్ రికార్డు సృష్టించబోతున్నారు.
దాదాపు 150కి పైగా నియోజకవర్గాల్లో లోకేష్ పాదయాత్ర ఉండేలా తెలుగుదేశం పార్టీ, రాబిన్ శర్మ బృందం రూట్‌మ్యాప్ తయారుచేసింది. నిజానికి ఈ సమయంలో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్తేజం ఉండాలి. మళ్లీ తమకు మంచి రోజులు వస్తున్నాయనే ఆశ, ఉత్సాహం టీడీపీ నేతల్లో కనిపించాలి. ఒకరకంగా చెప్పాలంటే ఆ పార్టీలో పండుగ వాతావరణం ఉండాలి. గతంలో జగన్ పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించినప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. వైసీపీ నేతలంతా పాదయాత్ర ప్రారంభం కోసం ఎదురుచూశారు. ఆ పార్టీ శ్రేణుల్లో జగన్ అడుగులు ధైర్యాన్ని నింపాయి. అధికారంలోకి వస్తున్నామనే భరోసానిచ్చాయి.
కానీ, లోకేష్ పాదయాత్ర సీన్ చూస్తే అలా లేదు. అస్సలు లోకేష్ పాదయాత్రను టీడీపీ నేతలే పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు వారిలో పెద్ద ఉత్సాహమే లేదు. ఇందుకు ఒక కారణం ఉందనే ప్రచారం జోరుగా సాగుతున్నది. గతంలో ఉన్న పాదయాత్ర సెంటిమెంట్ లోకేష్ విషయంలో ఫెయిల్ అయితుందేమో అనే భయం తెలుగుదేశం పార్టీ నేతల్లో ఉన్నట్లు తెలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో పాదయాత్రలకు ఆధ్యం పోసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి.
చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు ఆయన చేసిన పాదయాత్ర అప్పట్లో ఒక చరిత్ర. ఆయన పాదయాత్రతోనే 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక, 2014 ఎన్నికలకు ముందు వైసీపీ తరపున షర్మిల పాదయాత్ర చేయగా తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేశారు. కానీ, ప్రజలు చంద్రబాబు నాయుడునే గెలిపించారు. పాదయాత్రగా ప్రజల్లోకి వెళ్లిన ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే కాబట్టి గెలుపు ఆయననే వరించింది. షర్మిల మాత్రం తన అన్నను ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఇది విజయవంతం కాలేదు. ఆమె కష్టం ఫలించలేదు.
ఆ తర్వాత జగన్ కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పాదయాత్ర చేసి సక్సెస్ అయ్యారు. ఆయనను ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. కానీ, లోకేష్‌కు షర్మిలకు ఎదురైన అనుభవమే ఎదురవుతుందా అనే ఒక ఆందోళన తెలుగుదేశం పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. ఎందుకంటే, లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. తనను ముఖ్యమంత్రి చేయమని అడగలేరు. తన తండ్రిని ముఖ్యమంత్రిని చేయమని అడగాలి. అసలు పాదయాత్రలో ఆయన ఏం హామీ ఇస్తారనేది మరో అనుమానం. ఏ హోదాలో ఆయన ప్రజల సమస్యలను పరిష్కరిస్తానని చెప్పగలరు ? అనేది టీడీపీ నేతలకే అంతుచిక్కడం లేదు.
ఒకవేళ అన్నీ చేసేస్తా.. చూసేస్తే.. అని కనుక లోకేష్ హామీలు ఇచ్చుకుంటూ వెళ్తే ఇక చంద్రబాబు రిటైర్ అయ్యారని, లోకేష్‌యే వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లవచ్చు. ఇది మొదటికే మోసం చేస్తుందనే భావన టీడీపీలో ఉంది. పైగా లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితే జనసేనతో పొత్తు కష్టమే. లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధపడకపోవచ్చు. మరోవైపు లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారంటే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా టీడీపీకి వ్యతిరేకంగా మారిపోవచ్చు. ఇలా అనేక అనుమానాలు, భయాలతో లోకేష్ పాదయాత్ర మొదలువుతున్నది. మరి, ఏం జరుగుతుందో చూడాలి.