గత కొద్ది రోజులుగా మైలవరం నియోజకవర్గంలో అధికార పార్టీ వైసీపీలో తీవ్ర విభేదాలు చోటు చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు, మంత్రి జోగి రమేష్‌కు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. జోగి రమేష్ వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అయితే దీనిపై వసంత తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వైసీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.అటు అధిష్టానం కూడా మైలవరం నియోజకవర్గంను చాలా సీరియస్‌గానే తీసుకుంది. ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో భేటీ అయిన జగన్.. మైలవరం ఆయనకే అని హామీ కూడా ఇచ్చారు. సీటు హామీ దక్కిన తరువాత జగన్ పుట్టిన రోజుల వేడుకను కూడా వసంత ఘనంగా నిర్వహించారు. తరువాత ఏం జరిగిందో తెలియదు కాని .. వసంత సడన్‌గా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పదిమంది పోరంబోకులను వెంటేసుకుని తిరగడం నా చేతకాదు, అలాంటి రాజకీయాలు నాకొద్దు అంటూ వసంత చేసిన వ్యాఖ్యలు అటు పార్టీ కేడర్‌ను తీవ్ర నిరుత్సాహానికి గురి చేశాయి. వీరిద్దరూ కాకుండా మైలవరం వైసిపికి కొత్తవారు వస్తే ఎలా ఉంటుంది అంటూ వైసిపి శ్రేణులు సోషల్ మీడియా లో పోస్టింగ్ లు కూడా పెడుతున్నట్లు తెలుస్తోంది.
ఇటువంటి తరుణంలోనే మైలవరం నియోజవర్గంలో కొత్త వ్యక్తి పేరు తెర మీదకు వచ్చింది.
దీంతో మైలవరం నియోజకవర్గానికి త్వరలో వైసిపి నుండి నియోజకవర్గం ఇంచార్జి రాబోతున్నాడంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ పుకార్లను ఖండించకపోగా… మంత్రి జోగి రమేష్ తన పుట్టిన రోజు వేడుకల సందర్భంగా చేసిన బల ప్రదర్శన తో ఈ పుకార్లకు మరింత ఊతం ఇచ్చినట్లయింది. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున మైలవరం ఎమ్మెల్యేగా ఎన్నికైన చనుమోలు వెంకట్రావు మరణం తరువాత ఆయన కుమారుడు చనుమోలు అనిల్‌కు నియోజకవర్గం ఇంచార్జి భాద్యతలు అప్పగించారు.
కాని 2009 ఎన్నికలలో ఇంచార్జి చనుమోలు అనిల్ కు బదులుగా మరో స్థానికుడైన అప్పసాని సందీప్ కు టిక్కెట్ ఇవ్వడం తో సందీప్ పైన దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం లో గెలుపొందారు. ఇప్పుడు చనుమోలు వెంకట్రావు కుమారుడు చనుమోలు అనిల్ సడన్‌గా తెర మీదకు వచ్చారు. మైలవరం వైసీపీ ఇంచార్జ్‌గా ఆయన ఉంటారని కొందరు వాట్సాప్ గ్రూపుల్లో షేర్లు చేస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియదు కాని.. మైలవరం నియోజకవర్గంలో మాత్రం తీవ్ర విభేదాలు చోటు చేసుకున్నాయి. దీనిపై జగన్ కలుగజేసుకుని చక్కదిద్దకపోతే.. పరిస్థితి చేయి దాటిపోయే ప్రమాదం నెలకొంది.