వినేవాళ్లు వెర్రి వాళ్లయితే చెప్పేవాళ్లు యెల్లో మీడియా జర్నలిస్టులు. తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జేబు మీడియా ఛానళ్లు చేస్తున్న ప్రయత్నాలు, చెప్తున్న మాటలు వింటుంటే దేనితో నవ్వాలో కూడా రాజకీయాలు తెలిసిన వారికి అర్థం కాదు. ఏదో ఒక ఫేక్ న్యూస్‌ను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడం, తర్వాత సోషల్ మీడియా వైరల్ అవుతున్నది అంటూ యెల్లో మీడియాలో వార్తలు వేయడం, ఈ వార్తల ఆధారంగా డిబేట్‌లు నిర్వహించి తిమ్మిని బమ్మిని చేసేందుకు ప్రయత్నించడం యెల్లో మీడియా ఫార్ములా. ఇది గతంలో నడిచింది కానీ ఇప్పుడు నమ్మేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. తాజాగా యెల్లో మీడియా ఇలాంటి ఒక ప్రయత్నమే చేసి అభాసుపాలైంది.
ప్రశాంత్ కిశోర్‌కు చెందిన ఐప్యాక్ సంస్థ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ సంస్థనట.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అని ఒక సర్వే చేసిందట. ఈ సర్వేలో కేవలం ప్రస్తుత మంత్రుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, నారాయణస్వామి, పినిపె విశ్వరూప్, దాడిశెట్టి రాజా మాత్రమే గెలుస్తారట. మిగతా 20 మంది మంత్రులు ఓడిపోతారని ఈ సర్వే చెప్పిందట. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిందట. దాని మీద ఐప్యాక్ లోగో కూడా ఉందట. ఇంకేం యెల్లో మీడియాకు ఒక రోజుకు కావాల్సిన డిబేట్‌కు మంచి మేత తయారుచేసుకొని రెచ్చిపోయింది.
ప్రస్తుత మంత్రుల్లో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, పీడిక రాజన్న దొర, అంబటి రాంబాబు, బూడి ముత్యాలనాయుడు, ఉషశ్రీ చరణ్, రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కొట్టు సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, గుడివాడ అమర్‌నాథ్, కారుమూరి నాగేశ్వరరావు, జోగి రమేశ్, విడద రజిని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, గుమ్మనూరి జయరాం, కాకాణి గోవర్ధన్ రెడ్డి, మేరుగు నాగార్జున ఓడిపోతారని సదరు యెల్లో మీడియా కథ అల్లింది.
13 మంది మాజీ మంత్రుల్లోనూ కేవలం కొడాలి నాని, ధర్మాన కృష్ణదాస్ మాత్రమే మళ్లీ గెలుస్తారట. మిగతా 11 మంది మంత్రులు ఓడిపోతారట. అయితే, రాజకీయాలపై, ఈ నేతల బలాబలాలపై అవగాహన ఉన్న వారు ఎవరైనా ఈ సర్వే యెల్లో మీడియానే క్రియేట్ చేసిందని ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఓడిపోయే మంత్రుల్లో బొత్స సత్యనారాయణ పేరు పెట్టడమే ఇందుకు ఉదాహరణ. విజయనగరం రాజకీయాలు, బొత్స సత్యనారాయణ బలం గురించి తెలిసిన వారు ఎవరూ ఈ మాట నమ్మరు.
1999 నుంచి విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి తిరుగులేదు. ఆ ఎన్నికల్లో రాష్ట్రమంతా టీడీపీ హవా వీచింది. కాంగ్రెస్ కేవలం ఐదు ఎంపీ సీట్లు గెలవగా అందులో బొత్స ఒకరు. ఆ తర్వాత ఆయన సతీమణి రెండుసార్లు ఎంపీగా గెలిచారు. బొత్స చీపురుపల్లే నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారు. ఒక్కొక్కరికి వెయ్యి, రెండు వేల ఓట్లు కూడా రాలేదు. కానీ, బొత్స సత్యనారాయణ మాత్రం చీపురుపల్లెలో 43 వేల ఓట్లు తెచ్చుకొని రెండో స్థానంలో నిలిచారు. ఆయన బలం గురించి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ.
అలాంటిది మంత్రిగా ఉండి బొత్స సత్యనారాయణ రానున్న ఎన్నికల్లో ఓడిపోతారని చెప్పడమంటేనే ఇదే ఫేక్ సర్వే అని, యెల్లో మీడియా క్రియేట్ చేసిందేనని అర్థమవుతోంది. అయినా ఐప్యాక్ సర్వే చేస్తే బయటకు ఎలా లీక్ అవుతుంది. సర్వే రిపోర్టులు ముఖ్యమంత్రి జగన్‌కు నేరుగా అందిస్తారు కానీ సోషల్ మీడియాలో ఎలా లీక్ అవుతుంది. ఏదో ఒక రోజు డిబేట్ కోసం యెల్లో మీడియా వండిన కథ ఈ లీక్ స్టోరీ అని అందరికీ ఇట్టే అర్థమవుతున్నది.