తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభమైంది. తన తండ్రి కంచుకోట లాంటి కుప్పం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ప్రారంభించారు. యువగళం పేరుతో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసి ఆయనలా పాదయాత్ర చేసి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసి ఆయనలా పాదయాత్ర చేసి తాను కూడా మాస్ లీడర్‌గా ఎదగాలని, అన్ని కలిసొస్తే అధికారంలోకి రావాలని నారా లోకేష్ పట్టుదలగా ఉన్నారు. అందుకే జగన్ బాటలోనే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు.
లోకేష్ బాబు పాదయాత్ర వ్యవహారం మొత్తం ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు చూసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో ఆయన కనిపించకపోయిన వెనుక నుండి కథంతా ఆయనే నడిపిస్తున్నారు. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ నేతలతో మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రను ఎలా విజయవంతం చేయాలి, పాదయాత్రకు ఎలా హైప్ తీసుకురావాలి, మీడియా అటెన్షన్‌ను ఎలా తిప్పుకోవాలి వంటి అంశాలపై చంద్రబాబు నాయుడు.. లోకేష్‌తో పాటు తెలుగుదేశం శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు భారీ కుట్రకే తెరలేపారని ఓ ప్రధాన పత్రిక సంచలన ఆరోపణ చేసింది.
ఈ పత్రిక కథనం ప్రకారం.. లోకేష్ పాదయాత్ర ప్రారంభించడానికి ఒక రోజు చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన చర్యలపై వారికి చంద్రబాబు తన అనుభవాన్ని అంతా రంగరించి పలు సూచనలు చేశారు. అయితే, ఈ సూచనల్లో కుట్రకోణం ఉంది. లోకేష్ పాదయాత్రకు పబ్లిసిటీ కోసం, మీడియా అటెన్షన్‌ను తిప్పుకోవడానికి రోజూ ఏదో ఒక గొడవనో, రాద్దాంతమో చేయాలని చంద్రబాబు టీడీపీ శ్రేణులకు సూచించారట.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జేబు సంస్థలైన యెల్లో మీడియాలో ఎంత కవరేజీ వచ్చినా న్యూట్రల్ పబ్లిక్ పట్టించుకోరని చంద్రబాబు మదనపడుతున్నారు. అందుకే, యెల్లో మీడియా కాకుండా న్యూట్రల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున కవరేజీ వచ్చేలా చూడాలని చంద్రబాబు భావిస్తున్నారు. లోకేష్ పాదయాత్ర, ఆయన స్పీచ్‌లను అవి పెద్దగా ప్రసారం చేయవు. ఎందుకంటే అంతిమంగా ఆ ఛానళ్లకు కావాల్సింది టీఆర్పీ రేటింగులు. లోకేష్ బాబు స్పీచ్‌లకు ఏపాటి టీఆర్పీ రేటింగులు వస్తాయో అన్ని ఛానళ్లకు తెలుసు.
కాబట్టి, నిత్యం ఏదో ఓ గొడవ చేయడం ద్వారా ఈ ఛానళ్ల అటెన్షన్‌ను పొందాలని చంద్రబాబు టీడీపీ నేతలకు సూచించారని సదరు పత్రిక సంచలన ఆరోపణలు చేసింది. లోకేష్ పాదయాత్రను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని, సభకు జనాన్ని రానీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని రకరకాల గొడవలకు దిగాని చంద్రబాబు సూచించడం సంచలనంగా మారింది. అంతేకాదు, సాక్షి మీడియాకు చెందిన విలేఖరుల మీద దాడులకు కూడా దిగాలని చంద్రబాబు చెప్పారట. ఇవన్నీ పాటిస్తే కచ్చితంగా రానున్న నాలుగు వందల రోజుల పాటు రాష్ట్రంలో నిత్యం రాజకీయ అలజడి ఉంటుంది. ఇది తెలుగుదేశం పార్టీకి, నారా లోకేష్‌కు తాత్కాలిక లబ్ది కలుగుతుందేమో కానీ రాష్ట్రానికి మాత్రం చాలా నష్టం చేస్తుంది.