వైసీపీలో తొలి వికెట్ పడిందా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన ఆనం రామనారాయణ రెడ్డి వేటు పడే అవకాశాలు ఎక్కువుగా కనిపిస్తున్నాయి. దాదాపు ఆయన్ను పార్టీ నుంచి బయటకు పంపే కార్యక్రమాలు మొదలైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆనం రామనారాయణ రెడ్డి మొదటి నుంచి కూడా పార్టీలో అసంతృప్తితోనే కొనసాగుతున్నారు. జిల్లా రాజకీయాలతో పాటు, రాష్ట్ర రాజకీయాలకు కూడా ఆనం రామనారాయణ రెడ్డి చాలా సీనియర్ నేత. వైఎస్ఆర్ హయంలో రెవెన్యూ శాఖకు మంత్రిగా ప్రాతినిధ్యం కూడా వహించారాయన. అలాంటి నేత వైఎస్ఆర్ మరణం తరువాత అనుహ్యంగా టీడీపీలో చేరి..ఉన్న పరువు పొగొట్టుకున్నారు. అక్కడ ప్రాధాన్యత లేకపోవడంతో 2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. జగన్ కూడా ఆనం రామనారాయణ రెడ్డికి ప్రాధాన్యతను ఇస్తూ… వెంకటగిరి నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు. జగన్ ప్రభంజనంలో ఆనం రామనారాయణ రెడ్డి కూడా విజయం సాధించారు .
ఆనం రామనారాయణ రెడ్డి విజయం సాధించిన వెంటనే తనకు మంత్రి పదవి లభిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాని జగన్ తనని నమ్మి పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులకు అధిక ప్రాధాన్యతను ఇస్తూ వచ్చారు. దీనిలో భాగంగానే మొదటి మంత్రివర్గ విస్తరణలో అనిల్ కుమార్ యాదవ్‌కు చోటు ఇవ్వగా, మంత్రివర్గ పున:వ్యవస్థీకరణలో భాగంగా కాకాణి గోవర్థన్ రెడ్డికి అవకాశం కల్పించారు. దీంతో ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. జగన్ రెండో మంత్రివర్గంలో అయిన చోటు లభిస్తుందని ఆశలు పెట్టుకున్నఆనం రామనారాయణ రెడ్డికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఎప్పుడైతే మంత్రివర్గంలో చోటు దక్కలేదో .. అప్పటి నుంచి కూడా ఆనం రామనారాయణ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం మొదటుపెట్టారు.
ఆనం రామనారాయణరెడ్డిపై పార్టీ అధిష్ఠానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. ఇటీవల బహిరంగ వేదికలపై వరుసగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకుంది. ఆనం వ్యాఖ్యలు, ఆయన వ్యవహారంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొంతకాలంగా ఆనం విమర్శలు చేస్తున్నా.. వేచి చూసే ధోరణిలో ఉన్న వైసీపీ అధిష్ఠానం.. రెండు, మూడ్రోజులుగా బహిరంగ వేదికలపై నుంచే ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తుండటంతో ఇకపై ఉపేక్షించకూడదని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. గత కొద్దికాలంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి సీఎం జగన్ తనదైన శైలిలో షాక్ ఇచ్చారు.
వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతల నుంచి ఆనం రామనారాయణ రెడ్డిని తప్పిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన స్థానంలో మరోక వ్యక్తిని తెర మీదకు తీసుకువచ్చారు. నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డినే వైసీపీ నుంచి పోటీ చేస్తారని క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తలు నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి ఇంటి వద్ద అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఆనం రామనారాయణ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్లే అని అభిప్రాయం కూడా వెల్లడైవుతుంది. ఇదిలా ఉంటే ఆనం రామనారాయణ రెడ్డికి వైసీపీలో దాదాపు గేట్లు మూసివేసినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు.మరి ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.