కారణాలు తెలియవు కాని.. ఈ మధ్య అధికార వైసీపీ పార్టీలో లుక లుకలు ఎక్కువైనట్లు కనిపిస్తున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు తమ పరిధి దాటి మరి మాట్లాడుతున్నారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. మంత్రి జోగి రమేష్ మధ్య విభేదాలు, నెల్లూరు జిల్లాలో కాకాణి గోవర్థన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ మధ్య మనస్పర్థలు, సీనియర్ ఎమ్మెల్యే ఆనం హద్దులు దాటి ప్రవర్తించడం.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ అధికారుల మీద విమర్శలు చేయడం.. ప్రకాశం జిల్లాలో ఆమంచి, కరణం బలరాం వర్గీయుల మధ్య అధిపత్యపోరు ఇలా వైసీపీలో ఎప్పుడు లేనంత తీవ్ర సంక్షోభం నెలకొంది. వీరందరు కూడా పార్టీ గీత దాటి మాట్లాతున్నప్పటికి కూడా పార్టీ అధినేత జగన్ దీనిపై ఎప్పుడు కూడా నేరుగా మాట్లాడింది లేదు. సరిగ్గా ఇదే సమయంలో ఎమ్మెల్యే శ్రీదేవికి చెక్ పెడుతూ.. ఆమె నియోజకవర్గలంలో మరొవ్యక్తికి బాధ్యతలను అప్పగించడంతో.. తాను నిర్ణయం ఏమిటో చెప్పకనే చెప్పేశారు జగన్.
పార్టీ నేతలతో పిలిచి బుజ్జగించేది లేదని ఈ ఘటనతో నేతలకు సూచించారు. దీంతో వెంటనే నెల్లూరు, కృష్ణాజిల్లా నేతలు దెబ్బకు సెట్ అయ్యారు. ఆనం రాంనారాయణ రెడ్డి ఈ మధ్య పార్టీ హద్దులు దాటి ప్రవర్తించడంతో.. ఆయనపై వేటు వేసి సంచలనం సృష్టించారు జగన్. ఆనం రాంనారాయణ రెడ్డి స్థానంలో వెంకటగిరి బాధ్యతల నుంచి ఆనం రాంనారాయణ రెడ్డి తప్పిస్తూ..నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డికి వెంకటగిరి నియోజకవర్గ బాధ్యతలను అప్పగిస్తూ జగన్ ఉత్తర్వులు కూడా జారీ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆనం రాంనారాయణ రెడ్డి వైసీపీ నుంచి టికెట్టు లేనట్లుగానే కనిపిస్తోంది. ఇక ప్రభుత్వ అధికారుల మీద విమర్శలు చేసిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని తాడేపల్లికి పిలిపించుకుని మరి క్లాస్ పీకినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని పనులు చేయించుకోవాలని కోటంరెడ్డికి జగన్ హితవు పలికినట్లుగా సమాచారం అందుతుంది.
ఇక కృష్ణాజిల్లా మైలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వసంత, మంత్రి జోగి రమేష్ మధ్య అధిపత్య పోరుకు కూడా జగన్ చెక్ పెట్టారు. దీనిపై ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ను పిలింపించుకుని మాట్లాడిన జగన్.. మైలవరం టికెట్ ఆయనకే కేటాయిస్తూ.. కలిసి పని చేసుకోవాలని సూచించారు. ఇక ప్రకాశం జిల్లా ఆమంచి కృష్ణమోహన్, కరణం బలరాం వర్గీయుల మధ్య అధిపత్యపోరుకు కూడా జగన్ శుభం కార్డు వేశారు. టీడీపీలో గెలిచిన , కరణం బలరాం తరువాత వైసీపీ తీర్థం పుచ్చుకోవడం..ఆమంచి కృష్ణమోహన్‌కి పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఆమంచి కృష్ణమోహన్‌ను చీరాల నుంచి పర్చూరు నియోజకవర్గ ఇంచార్జ్‌గా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. దీనిని బట్టి చూస్తే..ఆమంచి కృష్ణమోహన్ వచ్చే ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. ఇలా పార్టీలో ఉన్న లుకలుకలన్ని కూడా ఒక్కొక్కటిగా సెట్ చేసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు.