ఎవరు ఎన్ని అనుకున్నా కూడా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ తాను అనుకున్నదే చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. జగన్ వైసీపీ పార్టీ స్థాపించిన నాటి నుంచి కూడా ఇదే వైఖరితో ఉన్నారు. దీంతో కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికి కూడా ఆయన ఈ విషయంలో పెద్దగా వెనుతిరిగింది లేదు. 2014 ఎన్నికల్లో రుణమాఫీ ఒక్క హామీ ఇస్తే అధికారంలోకి వస్తామని తెలినప్పటికి కూడా… అది ఆచరణ సాధ్యం కాదని చెప్పి… తనలోని రాజకీయ పరిణితిని అప్పుడే చాటి చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా తాను ఏది అయితే చేస్తానో దానినే తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు 90 శాతం హామీలను నెరవేర్చారు. అయితే జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీని మాత్రం ఇప్పటి వరకు తీర్చలేకపోయారు. అది ఏమిటంటే..సంపూర్ణ మద్యపానం నిషేదం.
తాను అధికారంలోకి వచ్చిన తరువాత సంపూర్ణ మద్యపానం నిషేదం చేస్తానని హామీ ఇచ్చారు జగన్. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలు భారీగా పెంచారు. అదే టైం లో కొత్త రకం బ్రాండ్లను కూడా ఏపీకి పరిచయం చేశారని విమర్శలు ఎదుర్కొన్నారు. కాని దానిని మాత్రం ఆచరణలో పెట్టలేకపోయారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. మద్యం నుంచే వచ్చే డబ్బులనే సంక్షేమ పధకాల వైపు మళ్లీస్తున్నారు. ఏటా పాతిక వేల కోట్ల రూపాయల ఆదాయం ఖజానాకు వచ్చి చేరుతుందని లెక్కలు చెబుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థుతుల్లో సంపూర్ణ నిషేధం విధిస్తే..అది ఖచ్చితంగా వైసీపీ సర్కార్‌కు తీవ్ర నష్టమే అని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మద్యం అమ్మకాలను వదులుకుని సంపూర్ణ మద్యపాన నిషేధం విధించాలి అంటే మాత్రం అది సాహసం అని వారు అంటున్నారు. దీని వల్ల ఏపీ ఆర్ధికంగా కూడా ఇబ్బందులో పడుతుంది అని అంటున్నారు.
కాని జగన్ దీనిపై సంచలన నిర్ణయానికి రెడీ అవుతున్నట్లుగానే సమాచారం అందుతుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం విధించడానికి జగన్ సిద్దం అవుతున్నారని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం ఖాయం అని పార్టీ నాయకులు కూడా చెబుతున్నారు. తద్వారా మహిళ ఓటర్లకు చేరువయ్యే ప్రయత్నాలు మరింత ఎక్కవు అవుతాయని జగన్ భావిస్తున్నారు. ఏపీలో పెద్ద ఎత్తున ఉండే మహిళా ఓటర్లు వైసీపీ వైపుగా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇపుడు బ్రహ్మాస్త్రం లాంటి మద్య నిషేధం హామీని ఇస్తే మాత్రం వైసీపీకి భారీ అడ్వాంటేజ్ అవుతుంది అన్న చర్చ ఉంది. ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ తరువాత సంపూర్ణ మద్యపాన నిషేధం ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో నిలిచిపోవడం ఖాయం.