Monday, February 10, 2025

చేతులెత్తేసిన చంద్రబాబు.. పత్తాలేని పవన్.. ఏపీవ్యాప్తంగా జనాగ్రహం!

- Advertisement -

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యారు. పెద్దగా మాట్లాడడం లేదు. విపక్షంలో ఉన్నప్పుడు ఓ రేంజ్ లో విరుచుకుపడే పవన్ ఇప్పుడు ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్న వినిపిస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు పథకాలు అమలు చేయలేమని ప్రకటించిన తరువాత కనీస స్పందన లేదు. ఎన్నికలకు ముందు జనసేన మేనిఫెస్టోను రూపొందించారు. అయితే అప్పట్లో దానిని పక్కన పెట్టారు. టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలకు జై కొట్టారు. సంపదను సృష్టించి మరి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని.. అధికారంలోకి వచ్చిన వెంటనే చేసి చూపిస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. దానికి సాక్ష్యం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కానీ ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ తనకు ఏది పట్టనట్టు వ్యవహరిస్తుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

తాను ఎక్కడ ఉన్నా ప్రశ్నిస్తానని తరచూ చెబుతుంటారు పవన్ కళ్యాణ్. తాను తప్పు చేసినా ప్రశ్నించవచ్చు అని సూచిస్తుంటారు. కానీ ఇప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేయలేనని చంద్రబాబు ప్రకటించిన తరువాత కూడా పవన్ స్పందించడం లేదంటే ఏమని అర్థం చేసుకోవాలి. సంక్షేమ పథకాలు హామీలు ఇచ్చినప్పుడు చంద్రబాబు అనుభవం ఎక్కడికి వెళ్ళింది? పథకాలకు ఇంత ఆర్థిక భారం పడుతుందని ఆయనకు తెలియదా? కానీ ఇదంతా ముందస్తు ప్లాన్ గా తెలుస్తోంది. కేవలం వైసీపీని అధికారం నుంచి దూరం చేయాలి. తాము అధికారంలోకి రావాలి. ఆ ఒక్క అజెండాతో ముందుకు సాగారు చంద్రబాబు. దానికి ఎనలేని సహకారం అందించారు పవన్ కళ్యాణ్. అయితే తాను సంక్షేమ పథకాలు అమలు చేయలేనని చంద్రబాబు చేతులెత్తేసిన పవన్ నోరు మెదపకపోవడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

సంపద సృష్టించి మరి పథకాలు అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. దానికి పవన్ కళ్యాణ్ సైతం సలాం కొట్టారు. ఈ రాష్ట్రానికి అనుభవజ్ఞుడైన నాయకుడు చంద్రబాబు నాయకత్వం అవసరమని బల్లగుద్ది మరి చెప్పారు. కానీ అదే చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేయలేక పథకాలకు హామీ ఇచ్చామని.. అమలు చేయలేమని బదులిచ్చారు. ప్రజలకు ఒక స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. పథకాలపై ఆశలు వదులుకోండి అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఇంత జరుగుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం మాట్లాడడం లేదు.

ఏపీ ప్రజల బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కూటమి ప్రభుత్వం నిర్దేశిస్తుందని కూడా సెలవిచ్చారు. మరో 10 ఏళ్ల పాటు కూటమి సమన్వయంగా ముందుకు సాగాలని కూడా ఆకాంక్షించారు. మరో పదేళ్లపాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ తేల్చేశారు. కానీ సంక్షేమ పథకాల విషయంలో తాము హామీలు ఇచ్చామని.. కూటమి తరుపున చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించారు అన్న విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు పవన్. సంక్షేమ పథకాలు అమలు చేసిన జగన్ పై విమర్శలు చేసేవారు పవన్. తాము వస్తే రెట్టింపు సంక్షేమంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని పవన్ హామీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అదే పవన్ ఎక్కడికి వెళ్లారని ప్రజల నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ తన పై ఉన్న మంచి అభిప్రాయాన్ని పోగొట్టుకున్నారని విశ్లేషకులు సైతం అభిప్రాయపడే పరిస్థితికి వచ్చింది.

ఈ ఎన్నికల్లో కూటమికి ఏకపక్షంగా జై కొట్టారు ప్రజలు. చంద్రబాబు సంక్షేమం విషయంలో గతంలో ఏం జరిగింది అన్నది ప్రజలకు తెలుసు. కానీ ఈసారి మాత్రం అలా జరగదని భావించారు. అందుకు పవన్ కళ్యాణ్ ను చూపించారు. పవన్ తప్పకుండా సంక్షేమ పథకాల విషయంలో పట్టుబడతారని.. ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయాల్సిందేనని తేల్చి చెబుతారని.. పవన్ కు భయపడి చంద్రబాబు అమలు చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు అదే పవన్ కనీసం నోరు మెదపకపోవడం ప్రజల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది. చంద్రబాబు బాహటంగా చేతులు ఎత్తేసిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడకపోవడం ఏంటని సొంత పార్టీ శ్రేణులే ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే సంక్షేమ పథకాల హామీలను పాడే కట్టి సంద్రంలో తోసేసారు చంద్రబాబు. కానీ పవన్ మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండడం విశేషం

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!