ఏపీ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టేది ఎవరు? విజయ్ సాయి రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు భర్తీచేస్తారు? ఏ పార్టీకి అవకాశం ఇస్తారు? టిడిపి తీసుకుంటుందా? లేకుంటే జనసేనకు చాన్స్ ఇస్తారా? బిజెపి ఆస్థానాన్ని కోరుకుంటుందా? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ చాన్స్ ఇస్తారని ప్రచారం నడుస్తోంది. గతంలో ముగ్గురు వైసీపీ రాజ్యసభ సభ్యులు పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో నాగబాబు పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో నాగబాబుకు చాన్స్ దక్కకుండా పోయింది. అయితే నాగబాబును సంతృప్తి పరచాలన్న కోణంలో చంద్రబాబు క్యాబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారు. అయితే ఇది జరిగి నెలలు గడుస్తున్నా నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. కీలకమైన మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే విమర్శలు వస్తాయని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే నాగబాబు సేవలను ప్రత్యామ్నాయంగా వినియోగించుకోవాలని చూస్తున్నారు. ప్రస్తుతం కూటమి పాలన గడుస్తున్న తరుణంలో టిడిపి, జనసేన మధ్య ఎక్కడికక్కడే గ్యాప్ పెరుగుతోంది. చిన్నచిన్న విభేదాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కూటమి పార్టీల మధ్య స్నేహం చెడిపోతే అంతిమంగా వైసిపికి అది లాబిస్తుంది. అందుకే చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చారు. కూటమి సమన్వయ బాధ్యతలను మెగా బ్రదర్ నాగబాబుకు అప్పగించాలని భావిస్తున్నారు. చేతిలో మంత్రి పదవి ఉంటే నాగబాబు క్రియాశీలకంగా వ్యవహరించలేరని అంచనాకు వచ్చారు. అందుకే నాగబాబుకు సమన్వయ బాధ్యతలతో పాటు రాజ్యసభ పదవి అప్పగించడానికి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఇద్దరు నేతలు ఒకలా మాట్లాడుకుంటే.. కేంద్ర పెద్దలు మరోలా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ పదవిని మెగాస్టార్ చిరంజీవికి ఇవ్వాలని కేంద్ర పెద్దలు నిర్ణయించినట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని బిజెపి భావిస్తోంది. నిన్నటి సార్వత్రిక ఎన్నికల్లో అతి కష్టం మీద బయటపడింది. మరోసారి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో బిజెపి బలపడాలన్నది అగ్ర నేతల ప్లాన్. అందులో భాగంగా చరిష్మా కలిగిన మెగాస్టార్ చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం.
ప్రజారాజ్యం పార్టీని స్థాపించి చేతులు కాల్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో పోటీ చేసి 18 స్థానాలకు పరిమితం అయ్యారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో తన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేశారు. కేంద్రంలో రాజ్యసభ పదవి అందుకోవడంతో పాటు కేంద్ర మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు చిరంజీవి. అయితే తన పదవీకాలం ముగియడం.. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోవడంతో చిరంజీవి క్రమేపి సైడ్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం చిరంజీవి తమ పార్టీ వారిని చెప్పుకొస్తూ వచ్చారు. కానీ చిరంజీవి మాత్రం కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర పెద్దలతో సన్నిహితంగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాని మోదీతో స్నేహపూర్వకంగా కొనసాగుతున్నారు. అందుకే చిరంజీవి సేవలను వినియోగించుకోవాలని బిజెపి భావిస్తోంది. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును చిరంజీవితో భర్తీ చేయాలని బిజెపి భావిస్తోంది. అయితే ఇప్పటికే ఆ సీటు నాగబాబుకు కేటాయించేందుకు చంద్రబాబు మొగ్గు చూపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయం కూడా అదే. కానీ చిరంజీవిని పంపాలన్న ఆలోచనలో బిజెపి అగ్రనాయకత్వం ఉంది. కానీ అందుకు చిరంజీవి అంగీకరించలేనట్లు తెలుస్తోంది. ఇలా మెగాస్టార్ కుటుంబంలోనే రాజ్యసభ దోబూచులాటడం గమనార్హం. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం ఉంటుందో.. ఎవరికి పదవి దక్కుతుందో చూడాలి.