టిడిపి కూటమి సర్కార్ పై కాపులు ఆగ్రహంగా ఉన్నారా? పవన్ చర్యలను తప్పు పడుతున్నారా? అనవసరంగా మద్దతు తెలిపామని బాధపడుతున్నారా? ఇప్పుడిప్పుడే వాస్తవాలను గ్రహిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ను నమ్ముకుని నష్టపోయామని కాపుల్లో ఇప్పుడిప్పుడే ఒక రకమైన అసంతృప్తి పెరుగుతోంది. అడుగడుగునా పవన్ కళ్యాణ్ రాజిపడుతుండడంతో.. తాము ఆశించిన ఫలితాలు దక్కవని కాపులు భావిస్తున్నారు. అనవసరంగా వైసీపీని వ్యతిరేకించామని బాధపడుతున్నారు. ఏదో అనుకుంటే ఏదో జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే సంబరపడిపోయామని.. కానీ వైసీపీలో కాపులకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వారి కంటే మించి పవన్ కాపుల విషయంలో ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు.
తాజాగా కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ ఇంటిపై దాడి జరిగింది. జనసేనకు చెందిన వ్యక్తి ఏకంగా ట్రాక్టర్ తో ఇంటి గేటును బద్దలు కొట్టుకొని లోపలికి ప్రవేశించాడు. హల్ చల్ చేశాడు. అయితే దీని వెనుక రాజకీయ ప్రోద్బలం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోసారి కాపు ఉద్యమం ఎగసిపడే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే టిడిపి అధికారంలో ఉన్న ప్రతిసారి ముద్రగడను టార్గెట్ చేస్తున్నారు ప్రత్యర్ధులు. ఇప్పుడు స్వయంగా జనసేన నేత దాడికి దిగడం అంటే మామూలు విషయం కాదు. కేవలం కాపులపైనే ఇటువంటి దాడులు జరుగుతుండడం గమనార్హం. ఎంత జరుగుతున్న పవన్ కళ్యాణ్ పట్టించుకోకపోవడంపై కాపుల్లో ఆగ్రహ వేషాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే వాస్తవ పరిస్థితిని గుర్తు చేసుకుంటున్నారు కాపులు.
పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పాకులాడుతున్నారు అన్న విషయాన్ని కాపులు గ్రహిస్తున్నారు. ఆయనకు కాపులపై అభిమానం కంటే వైసీపీ పై విపరీతమైన ద్వేషం. తన సామాజిక వర్గం కోసం పవన్ కళ్యాణ్ ఎన్నడూ మాట్లాడలేదు. గత ఎనిమిది నెలలుగా వారి ప్రయోజనాల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు కూటమి ప్రభుత్వం. పైగా సొంత సామాజిక వర్గం నేతలపై భౌతిక దాడులకు దిగుతుండడం కూడా కాపుల్లో ఆలోచనకు పురిగొల్పుతోంది. మిగతా సామాజిక వర్గాల నేతల విషయంలో ఇటువంటి పరిస్థితి లేదు. కానీ కేవలం కాపుల కోసం ఉద్యమించిన ముద్రగడ లాంటి నేతపై దాడికి దిగడం మామూలు విషయం కాదు. కాపుల్లో ఆలోచన ప్రారంభం అవ్వడానికి ఈ ఘటన కారణం అవుతోంది.
అయితే కాపుల్లో వస్తున్న వ్యతిరేకతను కూటమి ప్రభుత్వం గుర్తించింది. ముద్రగడ పద్మనాభం చుట్టూ అనుమానాస్పద చూపులు చూస్తోంది. మరోసారి ముద్రగడ తెరపైకి వస్తే ఇబ్బందికర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జనసేనకు చెందిన ఓ కార్యకర్త ఏకంగా ముద్రగడ ఇంటిపై దండయాత్ర చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలతో కాపులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఇంకోవైపు ఈ ఘటన ముద్రగడకు బలం పెంచుతోంది. ముద్రగడ బలమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ కాపు ఉద్యమం వైపు దిగితే పరిస్థితి మారే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి అయితే ప్రభుత్వ చర్యలతో పాటు జనసేన వ్యవహరిస్తున్న తీరుతో కాపులు కూటమికి దూరమవుతున్నారు.