ధర్మవరం ఈ పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే పేరు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ సుపరిచితం అయ్యారు. ఎమ్మెల్యే అంటే ఇలానే ఉండాలి అన్నంతగా ప్రాచుర్యం పొందారు. 2024 ఎన్నికల్లో వైసీపీ గెలిచే తొలి నియోజకవర్గం కూడా అదేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. అది కూడా బిజెపి అభ్యర్థి సత్యకుమార్ యాదవ్ చేతిలో. దానినే ఎక్కువగా జీర్ణించుకోలేకపోయారు కేతిరెడ్డి. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధి చేస్తే.. తనను ఓడించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నియోజకవర్గ ఎల్లలు తెలియని నేత చేతిలో ఓటిపోవడం ఏమిటన్నది వెంకట్రామిరెడ్డి బాధ.
తండ్రి అకాల మరణంతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కేతిరెడ్డి. మంచి విద్యాధికుడు కూడా. 2009లో తొలిసారిగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు వెంకట్రామిరెడ్డి. 2014 ఎన్నికల్లో ఓడిపోయినా… 2019లో మాత్రం భారీ విజయం నమోదు చేసుకున్నారు. వైసీపీ అధికారంలోకి రావడంతో ప్రజా సమస్యలపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ప్రజల మధ్యకు వెళ్తూ అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించేవారు. అయితే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరిట నిర్వహించిన కార్యక్రమం ఆయన ఇమేజ్ను అమాంతం పెంచింది. ఇక తనకు నియోజకవర్గంలో తిరుగు లేదని భావిస్తున్న తరుణంలో ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి. కానీ ఓడిపోయిన నాటి నుంచి అనేక రకాల విశ్లేషణలు చేస్తూ పార్టీని ఇరుకున పెడుతున్నారు. అదే సమయంలో టీవీ ఛానల్ లకు ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో విభిన్నంగా ప్రవర్తిస్తున్నారు. వైసిపి హయాంలో తప్పులు జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చంద్రబాబు అరెస్టును తప్పుపట్టారు. అదే వైసిపి ఓటమికి కారణమైందని చెప్పుకొచ్చారు.
అయితే తాజాగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి జనసేనలోకి చేరుతారని ప్రచారం నడుస్తోంది. గత కొంతకాలంగా ఆయన వైసీపీ పై వ్యతిరేక కామెంట్స్ చేస్తుండడంతో.. ఈ వార్త మరింత వైరల్ అవుతుంది. పార్టీతో పాటు అధినేత తీరుపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆవేదనతో ఉన్నారని.. త్వరలో ఆయన జనసేనలో చేరడం ఖాయమని టాక్ నడుస్తోంది. మంచి ఇమేజ్ ఉన్న నాయకుడు కావడంతో పవన్ కళ్యాణ్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా సత్య కుమార్ యాదవ్ ఉన్నారు. మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. ఆ సమయంలో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి లాంటి నేత అవసరం అని పవన్ భావిస్తున్నారట. అందుకే కేతిరెడ్డి ని పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అతి త్వరలో ముహూర్తం చూసుకొని ఆయన జనసేనలో చేరడం ఖాయమని తెగ ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే కేతిరెడ్డి కుటుంబానికి వైయస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉంది. తండ్రి అకాల మరణంతో వెంకట్రామిరెడ్డికి రాజకీయాల్లోకి రప్పించి టికెట్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. మహానేత అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేసింది కేతిరెడ్డి కుటుంబం. సందర్భం వచ్చినప్పుడల్లా వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని చెప్పుకుంటారు వెంకట్రామిరెడ్డి. తన గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమానికి వైయస్ రాజారెడ్డి ఆదర్శమని చాలా సందర్భాల్లో చెప్పారు వెంకటరామిరెడ్డి. అటువంటి నేత ఇప్పుడు జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతుండడంతో వైసీపీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. అయితే కేతిరెడ్డి జనసేనలో చేరారని.. అందులో ఎంత మాత్రం నిజం లేదని కేతిరెడ్డి అనుచరులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి