ఒకప్పుడు ఆ జిల్లా వైసీపీకి పట్టుకొమ్మ. ఆ పార్టీని ఎంతగానో ఆదరించింది ఆ జిల్లా. అటువంటిది ఈ ఎన్నికల్లో పూర్తిగా వైసిపి కనుమరుగయింది. అయితే ఇది జరిగి ఎనిమిది నెలలు అవుతున్న క్రమంలో ప్రజల్లో ఒక రకమైన చేంజ్ కనిపిస్తోంది. నేతలు కూడా వైసీపీ వైపు చూస్తున్నట్టు ఉంది. ఇంతకీ అది ఏ జిల్లా? ఏంటా కథ? అని తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయాల్సిందే.
రాజకీయాలందు సింహపురి రాజకీయాలు వేరయా అన్నట్టు ఉంటుంది పరిస్థితి. రాజకీయంగా చైతన్యవంతం కలిగిన జిల్లా ఇది. ఎంతోమంది హేమాహేమీలు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ముఖ్యమంత్రి పదవులు సైతం అలంకరించారు. అటువంటి జిల్లాలో వైసిపి తన సత్తా చాటింది. 2014, 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించింది. కానీ 2024 ఎన్నికలు వచ్చేసరికి చతికిల పడింది. దానికి కారణం వైసీపీలో వైఫల్యాలు. వైసీపీ నేతల మధ్య విభేదాలు. ఎన్నికలకు ముందు పార్టీకి మూల స్తంభాలుగా ఉన్న చాలామంది నేతలు కూటమిలో చేరడమే. ముఖ్యంగా పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి నేత వెళ్లిపోవడం నిజంగా లోటు.
అయితే వైసీపీలో స్వేచ్ఛకు అలవాటు పడిన చాలామంది నేతలు ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తిరిగి వైసిపి వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమంత కంఫర్ట్ గా లేనట్లు సమాచారం. గౌరవాన్ని వెతుక్కుంటూ వెళ్తే అక్కడ ఆశించిన స్థాయిలో లభించడం లేదని అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పైగా జిల్లా మంత్రులతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు వైఖరి పై వేమిరెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి కోవూరు నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు ప్రశాంతి రెడ్డి. భర్త ప్రభాకర్ రెడ్డి తో పాటు సైకిల్ ఎక్కారు. అయితే అప్పటికే టిడిపిలో మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి ఉన్నారు. ప్రశాంతి రెడ్డికి టికెట్ ఇవ్వడంతో వారు ఆగ్రహించారు. అధినేత సముదాయించడంతో ప్రశాంతి రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అయితే గెలిచిన తర్వాత ప్రశాంతి రెడ్డి తమను పట్టించుకోలేదని పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన కుమారుడు దినేష్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. తమకు గుర్తింపు లేదని ఆవేదనతో గడుపుతున్నారు. వేరే కుంపటితో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇదే విషయాన్ని వేమిరెడ్డి హై కమాండ్ కు ఫిర్యాదు చేశారు. కానీ హై కమాండ్ సైతం పట్టించుకోవడం లేదు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వేమిరెడ్డి. అనవసరంగా టిడిపిలోకి వచ్చాను అన్నది ఆయన భావన. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన టిడిపిలో ఉంది. మరోవైపు పాలెం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి,ఆయన కుమారుడు దినేష్ రెడ్డి వైసీపీలోకి వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది.