విజయవాడ మాజీ ఎంపీ కేసినేని నాని యాక్టివ్ అవుతారా? తిరిగి రాజకీయాల్లో కి వస్తారా? మరికొద్ది రోజుల్లో పొలిటికల్ రీయంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కేశినేని ట్రావెల్స్ ద్వారా రాష్ట్రంలోనే సుపరిచితం ఆ కుటుంబం. 2014లో అనూహ్యంగా టిడిపిలోకి ఎంట్రీ ఇచ్చారు కేసినేని నాని. బలమైన కుటుంబ నేపథ్యం ఉండడంతో చంద్రబాబు కూడా ప్రోత్సహించారు. ఆ ఎన్నికల్లో విజయవాడ లోక్సభ సీటు ఇచ్చారు. దీంతో ఘన విజయం సాధించారు కేసినేని నాని. ఎంపీగా అందరితో మమేకమై పనిచేశారు. అందరి మన్ననలు అందుకున్నారు. అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా మారారు.
అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. జగన్ ప్రభంజనం సృష్టించారు. అటువంటి సమయంలో కూడా కేశినేని నాని విజయవాడ ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ ఓడిపోయినా.. ఎంపీగా మాత్రం కేశినాని నాని గెలిచారు. అయితే అది తన వ్యక్తిగత చరిష్మాతోనే సాధ్యం అయిందని నాని భావించారు. అప్పటినుంచి నాని లో ఒక రకమైన ఆలోచన ప్రారంభమైంది. తనకంటూ పార్లమెంట్ స్థానం పరిధిలో గుర్తింపు ఉందని.. ఢిల్లీ స్థాయిలో కూడా తనకు పలుకుబడి పెరిగిందని ఆయన భావించారు. అక్కడ నుంచి అధినేత చంద్రబాబును లెక్కచేయడం మానేశారు. లోకేష్ నాయకత్వాన్ని సైతం వ్యతిరేకించారు. దీంతో పార్టీ హై కమాండ్ ఈ ఎన్నికలకు ముందు టిక్కెట్ ఇవ్వమని తేల్చేసింది. దీంతో కేసినేని నాని తన ప్రతాపం చూపిస్తానని చెప్పి వైసీపీలో చేరిపోయారు.
2024 ఎన్నికల్లో తన వ్యక్తిగత చరిస్మతో పాటు వైసిపి బలం తోడైతే విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి సునాయాసంగా విజయం సాధించవచ్చు అని అంచనా వేశారు. తప్పకుండా గెలిచి తెలుగుదేశం పార్టీకి తనంటే ఏంటో చూపిస్తానని పెద్ద ప్రయత్నమే చేశారు. కానీ భారీ ఓటమి ఎదురైంది. దానిని జీర్ణించుకోలేని కేసినేని నాని ఫలితాలు వచ్చిన రెండు మూడు రోజులకి రాజకీయాలనుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. చేజేతులా గెలిచే పార్టీని వదిలి ఓడిపోయే పార్టీలో చేరానన్న బాధ ఆయనలో వ్యక్తం అయింది. అయితే అప్పట్లో దూకుడు తనం వల్ల వ్యాపారాలు కోల్పోయానని.. ఇప్పుడు రాజకీయంగా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నానని మనస్థాపానికి గురయ్యారు నాని. అందుకే గత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఎంపీగా ఉత్తమ సేవలు అందించారన్న పేరు కేసినేని నానికి ఉంది. అందుకే ఆయన నాయకత్వాన్ని కోరుతున్న వారు ఉన్నారు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి యాక్టివ్ కావాలని కేశినేని నాని భావిస్తున్నట్లు సమాచారం.
టిడిపి నాయకత్వానికి.. కేశినేని నానికి మధ్య పెద్ద అగాధం సృష్టించడంలో స్థానిక టిడిపి నాయకులు దేవినేని ఉమా, బోండా ఉమా, బుద్ధ వెంకన్న సక్సెస్ అయ్యారు. వీరంతా లోకేష్ నాయకత్వంలో పనిచేశారు. లోకేష్ అండతోనే వీరు తనపై రెచ్చిపోతున్నారని కేశినేని నాని అనుమానించారు. అదే సమయంలో కేశినేని నాని దూకుడు చూసిన టిడిపి నాయకత్వం సోదరుడు కేశినేని నాని ద్వారా చెక్ చెప్పింది. అయితే ఇప్పుడు రాజకీయాలనుంచి తప్పుకున్నానన్న ప్రకటనపై కేశినేని నాని పునసమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. అటు జగన్మోహన్ రెడ్డి సైతం కేశినేని నాని యాక్టివ్ అయితే పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే తీవ్ర తర్జున భర్జన నడుమ కేశినేని నాని వైసీపీలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధపడినట్లు సమాచారం. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.