ప్రజలకు హామీలు ఇచ్చే ముందు ఆలోచించాలి. అవి అమలు సాధ్యమా? కాదా? అన్న విషయాన్ని గుర్తించుకోవాలి. అయితే ఒకవేళ హామీలు ఇస్తే ఖచ్చితంగా అమలు చేయాలి. లేకుంటే మాత్రం హామీలు ఇవ్వకూడదు. అయితే ఈ విషయంలో మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డిది ప్రత్యేక స్థానం. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేయాల్సిందేనన్న తత్వం ఆయనది. 2004లో అధికారంలోకి వచ్చారు వైయస్ రాజశేఖర్ రెడ్డి. సంక్షేమం అంటే ఎలా ఉంటుందా అని చేసి చూపించారు. ఆరోగ్యశ్రీతో పేద ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించారు. ఫీజు రియంబర్స్మెంట్ తో పేద విద్యార్థి చదువుకునేలా చేశారు. అత్యవసర వైద్యం అందించాలనుకున్న వారికి 108 తో ఆపద్బాంధవుడిగా మారారు. అప్పటివరకు సంక్షేమం అంటే నందమూరి తారక రామారావు అన్న పరిస్థితిని మార్చారు మహానేత రాజశేఖర్ రెడ్డి. కానీ ఆ మహానేతను తలదన్నే రీతిలో సంక్షేమాన్ని అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి.
2019లో అధికారంలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఒకే ఒక ఛాన్స్ అంటూ ప్రజలకు అవకాశం కోరారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పై ఎటువంటి ఆశలు పెట్టుకోలేదు. కేవలం యువనేత కావడంతో సరికొత్తగా ఆలోచిస్తారని భావించారు. కానీ ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నా.. సంక్షేమం ఎంతలా ఉంటుందా అని అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించి అమలు చేయగలిగారు. ప్రతి ఇంటా సంక్షేమాన్ని అందించారు. అందరి కళ్ళల్లో ఆనందం నింపారు. అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని గుర్తించిన ప్రజలు.. అభివృద్ధి చేయలేదన్న అపవాదును మిగిల్చారు. ఈ ఎన్నికల్లో తిరస్కరించారు.
అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను గుర్తించిన చంద్రబాబు అలవి కాని హామీలు ఇచ్చారు. రెట్టింపు సంక్షేమం అంటూ సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. సంపద సృష్టించి మరి సంక్షేమ పథకాలను అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. కానీ తీరా అధికారంలోకి వచ్చాక మాట మార్చారు. ఒక్క పథకం అంటే ఒక్క పథకాన్ని కూడా నిజాయితీగా అమలు చేసి చూపించలేకపోయారు. కనీసం ఒక్క పథకాన్ని కూడా పట్టాలెక్కించలేకపోయారు. కేవలం పింఛన్ల మొత్తాన్ని పెంచి అమలు చేయగలిగారు. అది కూడా ప్రతి నెల పింఛన్లలో కోత విధించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అంటూ ఒక సరికొత్త ఆశలు రేపారు. అసలు ఈ పథకం ఎవరికి వర్తిస్తుందో ఎవరికి వర్తించదు తెలియని పరిస్థితి.
ఉగాది నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అంటూ లీకూలిస్తున్నారు. ఈ పథకానికి గాను 6000 కోట్ల రూపాయలు ఏడాదికి ఖర్చు అవుతుందని చెబుతున్నారు. కానీ ఆ గణాంకాలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయి. 6000 కోట్లు అనేది ఐదేళ్లకు కూడా ఖర్చు కాదని.. అదంతా ఎన్నికల స్టంట్ అని ప్రచారం నడుస్తోంది. మరోవైపు అన్నదాత సుఖీభవ అమలు చేస్తామని చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనమని లీ కులుస్తున్నారు. కానీ ఇంతవరకు వాటిని అమలు చేసేందుకు కనీస కసరత్తు జరగడం లేదు. ఇది ముమ్మాటికి ప్రచార అస్త్రమే తప్ప.. అమలు చేయాలన్న చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.