ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలంటే ఒంటరిగా బరిలో దిగితే సాధ్యం కాదని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు నిర్ణయించాయి. అన్ని సర్వేలు చేయించుకున్న తర్వాత ఈ నిర్ణయానికి వచ్చాయి. అందుకే, గతంలో తిట్టుకున్న తిట్లు అన్నీ మరిచిపోయి మరీ పొత్తులకు సిద్ధమయ్యాయి. బయటకు ఇంకా పొత్తులు ఖరారు కాలేదని చెబుతున్నా ఇప్పటికే చర్చలు తుది దశకు వచ్చేశాయి. జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశంపై చర్చ జరుగుతోంది.
తాను ముఖ్యమంత్రి అవుతాననే భ్రమల్లో జనసైనికులు, అభిమానులు ఉన్నారు కాబట్టి ఆ భ్రమలు అలాగే ఎన్నికలు పూర్తయ్యే వరకు కొనసాగించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే, 10 – 20 సీట్లు తీసుకొని పోటీ చేస్తే ఆయన ముఖ్యమంత్రి ఎట్టి పరిస్థితుల్లో కాబోరనే విషయం అందరికీ అర్థం అవుతుంది. అందుకే 40 నుంచి 50 సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ పట్టు పడుతున్నట్టు తెలుస్తోంది. అందునా ఓడిపోయే సీట్లు తీసుకోవద్దని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు సమాచారం.
తనకు గోదావరి జిల్లాల్లోనే బలం ఉందని, ఈ జిల్లాల్లో అయితేనే తన సామాజకవర్గం ఎక్కువగా ఉన్నందున తన పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే గోదావరి జిల్లాల్లోనే 25 నుంచి 30 స్థానాల్లో పోటీ చేయాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. జనసేనకు ఇచ్చే సీట్లలో 90 శాతం వరకు గోదావరి జిల్లాల్లోనే ఇవ్వాలని తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
తాజాగా పవన్ కళ్యాణ్ పదే పదే గోదావరి జిల్లాల జపం చేస్తున్నారు. అక్కడే పర్యటిస్తున్నారు. గోదావరి జిల్లాల్లో వైసీపీని ఒక్క సీటు గెలవనివ్వనని మంగమ్మ శపథాలు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే జనసేనకే గోదావరి జిల్లాల్లో మెజారిటీ సీట్లు పొత్తులో భాగంగా ఇవ్వడం ఖాయమేనని తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాల నేతలు ఒక అభిప్రాయానికి వచ్చేశారు. ఇప్పుడు ఇదే ఆ పార్టీలో సంక్షోభానికి కారణమవుతోంది.
గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కూడా కాస్తోకూస్తో బలంగానే ఉంది. అనేక ఏళ్లుగా ఇక్కడ ఆ పార్టీ జెండా మోస్తున్న నేతలు ఉన్నారు. ఈసారి జనసేనతో పొత్తు వల్ల కచ్చితంగా గెలుస్తామని ఇంతకాలం వారంతా నమ్మకంగా ఉన్నారు. అయితే, జనసేనతో పొత్తు వల్ల అసలు తమకు టిక్కెట్లే ఇవ్వరనే స్పష్టత ఇప్పుడు రావడంతో గందరగోళంలో పడిపోయారు.
ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తమకు ప్రాధాన్యత ఇస్తే పార్టీలో చేరతామంటూ ప్రతిపాదనలు పంపిస్తున్నారు. ఇప్పటికే ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్సీ వైసీపీ గోదావరి జిల్లాల ఇంఛార్జి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో సంప్రదింపులు జరుపుతున్నారు. జనసేనతో పొత్తు వల్ల లాభమేమో కాని గోదావరి జిల్లాల టీడీపీలో సంక్షోభం మాత్రమే ఖాయమేనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.