Monday, February 10, 2025

ఆ నలుగురుకు ఎమ్మెల్సీ పదవులు ఖాయం!

- Advertisement -

ఏపీలో కూటమి గాలి బలంగా వీస్తోంది. మూడు పార్టీల మధ్య సమన్వయం సవ్యంగా సాగుతోంది. మరోవైపు కీలక నేతలు పార్టీని వీడుతుండడంతో వైసీపీ ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. అయితే ఇదే అదునుగా వైసీపీలో ఉన్న రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలను తన వైపు తిప్పుకునేందుకు కూటమి తెగ ప్రయత్నాల్లో ఉంది. ఏకంగా వైసిపి నేతలతో రాజీనామా చేయిస్తోంది. ఇందుకు కేంద్రంలోని బిజెపిని వాడుకుంటుంది కూటమి. ఇప్పటికే నాలుగు రాజ్యసభ పదవులను లాక్కుంది. ఓ ఆరుగురు ఎమ్మెల్సీలు సైతం పదవులకు రాజీనామా చేశారు. మరో నలుగురు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మరికొందరు ఈ మార్చ్ లో పదవి విరమణ చేయనున్నారు. ఇలా మొత్తం లెక్క కడితే ఓ 15 ఎమ్మెల్సీ సీట్లు కూటమికి దక్కే అవకాశం ఉంది. అంటే మూడు పార్టీలు ఎమ్మెల్సీ పదవులను సర్దుకుంటాయన్నమాట.

అయితే కూటమిలో పెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీకి అధిక పదవులు దక్కే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఆ పార్టీలో ఆశావహులు అధికంగా ఉన్నారు. కానీ చంద్రబాబు మాత్రం ఓ నలుగురు ముందుగా ప్రమోట్ చేసి.. తరువాత మిగతా వారి కోసం చూద్దామని తేల్చి చెప్పినట్లు సమాచారం. అందులో నాగబాబు, దేవినేని ఉమా, వంగవీటి రాధా, బుద్ధ వెంకన్న ఉన్నట్లు సమాచారం. ఈ నలుగురికి పదవులు ఇచ్చాక.. మిగతా వారి గురించి చూద్దాం అంటూ చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తక్షణం ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయితే.. తొలి విడత లోనే ఈ నలుగురు పేర్లు ప్రకటించడం ఖాయమని తెలుస్తోంది.

నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు. ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపు కోసం కృషి చేశారు. కూటమిలో సమన్వయానికి కూడా తన వంతు పాత్ర పోషించారు. ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపికి కేటాయించడంతో వెనక్కి తగ్గారు. అసలు పోటీ చేయకుండా ప్రచారానికి పరిమితం అయ్యారు. కూటమి అధికారంలోకి రావడంతో ఆయనకు కీలక పదవి ఇస్తారని ప్రచారం నడిచింది. రాజ్యసభ పదవి దక్కించుకొని పెద్దల సభలో అడుగు పెట్టాలని నాగబాబు భావించారు. అయితే మొన్న మూడు రాజ్యసభ పదవుల ఎంపిక సమయంలో చివరి వరకు నాగబాబు పేరు ఉంది. కానీ చివరి నిమిషంలో సమీకరణలు మారడంతో దక్కకుండా పోయింది. దీంతో చంద్రబాబు త్వరలో నాగబాబును క్యాబినెట్లోకి తీసుకుంటామని ప్రకటించారు. అందుకే ఇప్పుడు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి తర్వాత మంత్రిగా అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా దేవినేని ఉమా కొనసాగుతూ వచ్చారు. చంద్రబాబుకు అత్యంత విధేయత కలిగిన నేత కూడా. నారా లోకేష్ తో కూడా సన్నిహితంగా ఉంటారు. 2014లో మైలవరం నుంచి గెలిచిన ఉమాకు మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. కీలక పోర్టు పోలియో కూడా అప్పగించారు. 2019లో పార్టీతో పాటు ఉమా ఓడిపోయినా.. గత ఐదేళ్లుగా మాత్రం వైసిపి సర్కార్ పై గట్టిగానే పోరాడారు. తన వాయిస్ వినిపించారు. అయితే మైలవరం టిక్కెట్ను వసంత కృష్ణ ప్రసాద్ కోసం త్యాగం చేశారు ఉమా. కూటమి అధికారంలోకి రావడంతో ఉమాకు అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే ఈసారి ఎమ్మెల్సీ పదవిని ఆయనకు తప్పకుండా ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ తో పాటు మరో కీలక బాధ్యతలు కూడా ఉమా పై చంద్రబాబు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

వంగవీటి మోహన్ రంగ వారసుడు రాధాకృష్ణ. చాలా రోజులుగా రాజకీయాల్లో ఉన్న ఆశించిన స్థాయిలో పదవులు దక్కించుకోలేదు. 2004లో రాజశేఖర్ రెడ్డి పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అయితే 2009లో తప్పటడుగులు వేశారు. రాజశేఖర్ రెడ్డి వద్దని వారించిన వినకుండా ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి ఆవిర్భావంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించారు. ఆయనతో విభేదించి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు రాధ. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. గత ఐదేళ్లుగా టిడిపిలోనే కొనసాగుతూ వచ్చారు. ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపు కోసం కృషి చేశారు. అందుకోసమే రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం.

బుద్దా వెంకన్న తెలుగుదేశం పార్టీలోనే సుదీర్ఘకాలం కొనసాగుతూ వచ్చారు. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో వెంకన్నకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. చంద్రబాబుతో పాటు లోకేష్ కు అత్యంత విధేయుడు. ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ సీటును ఆశించారు. కానీ పొత్తులో భాగంగా ఆ సీటు బిజెపి దక్కించుకుంది. అక్కడ నుంచి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. పార్టీ ఐక్యత కోసం ఎంతగానో కృషి చేశానని.. తనకు మంచి పదవి ఇవ్వాలని పలు సందర్భాల్లో వెంకన్న కోరుతూ వచ్చారు. దీంతో ఎమ్మెల్సీల తొలి జాబితాలో వెంకన్న పేరు ప్రకటించాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తానికి అయితే ఈ నలుగురికి ఎమ్మెల్సీ పదవులు ఖాయం అని కూటమి వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. మరి ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!