ఆ జిల్లాలో వైసీపీ కీలక నేతలు ఏకమయ్యారా? కూటమి ఆధిపత్యానికి చెప్పాలని భావిస్తున్నారా? కేసులకు భయపడకూడదు అని నిర్ణయించుకున్నారా? పార్టీ పూర్వ వైభవం కోసం పరితపిస్తున్నారా? ఇంతకీ ఎవరు ఆ నేతలు? ఏ జిల్లా అంటే వాచ్ దిస్ స్టోరీ. ఉమ్మడి చిత్తూరు జిల్లా. ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లా. అయితే వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఆ పార్టీ తన ముద్ర చాటుకుంటుంది. 2014లో అయితే కీలక స్థానాలను దక్కించుకొని చంద్రబాబుకు సవాల్ విసిరింది వైసిపి. 2019లో అయితే క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో మాత్రం కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. అయితే తిరుపతి పార్లమెంటు స్థానాన్ని వైసీపీ దక్కించుకుంది. ఈ ఎన్నికల్లో వైసీపీ నేతల మధ్య సమన్వయం లోపించడంతోనే ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయన్న కామెంట్స్ ఉన్నాయి. కానీ ఇప్పుడు కూటమి పట్టు బిగుసుకుండడంతో వైసీపీ సీనియర్లంతా ఏకతాటిపైకి వస్తుండడం విశేషం.
వైసిపి హయాంలో ఒక వెలుగు వెలిగారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లాతో పాటు రాయలసీమ మొత్తం తన పట్టును నిలుపుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం పెద్దిరెడ్డికి అవకాశం ఇచ్చారు. పార్టీపై పూర్తిగా స్వేచ్ఛ కల్పించారు. అందుకే పెద్దిరెడ్డి తన హవాను చాటుకున్నారు. చివరకు చంద్రబాబును సైతం కుప్పంలో ఓడించేందుకు ప్రయత్నించారు. అయితే పెద్దిరెడ్డి తీరుతో అప్పటి మంత్రి రోజా ఇబ్బంది పడ్డారన్న టాక్ ఉంది. మరోవైపు సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం పెద్దిరెడ్డి తో విభేదాలు పెంచుకున్నారని ప్రచారం జరిగింది. అటు భూమన కరుణాకర్ రెడ్డి సైతం మిగతా నేతలతో సఖ్యతగా ఉండేవారు కాదన్న టాక్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ నేతలంతా ఐక్యతగా ముందుకు సాగుతుండడం విశేషం.
కూటమి ప్రభంజనంలో సైతం పుంగనూరు నుంచి గెలిచారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నుంచి గెలిచారు. కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి విజయం సాధించారు. పెద్దిరెడ్డి తీరుతో చిత్తూరు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైసీపీలో వర్గ విభేదాలు పెరిగాయన్న కామెంట్స్ అప్పట్లో వినిపించేది. నగిరి లో రోజా ఓటమికి పెద్దిరెడ్డి తీరే కారణం అన్న ఆరోపణ ఉంది. చంద్రగిరిలో చెవిరెడ్డి కుమారుడికి తగిన సహకారం అందించలేదని.. అక్కడ వైసీపీ నేతల సహాయ నిరాకరణ వెనుక పెద్దిరెడ్డి హస్తం ఉందని ప్రచారం నడిచింది. భూమన కరుణాకర్ రెడ్డి విషయంలో సైతం అదే పరిస్థితి ఉండేది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసిపి నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న మాదిరిగా ఉండేవారు. అయితే కేసులతోపాటు అరెస్టుల పర్వం నడుస్తుండడంతో.. చిత్తూరు జిల్లాలో వైసీపీ సీనియర్లు అంతా ఒకే తాటి పైకి రావడం ప్రారంభించారు.
కొద్దిరోజులుగా రాజకీయంగా సైలెంట్ గా ఉండేవారు మాజీ మంత్రి ఆర్కే రోజా. అధికార ప్రతినిధిగా నియమితులైన తర్వాత కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. త్వరలో ఆమె చిత్తూరు జిల్లాలో ఎంటర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూటమితో యుద్ధాన్ని ప్రకటించారు. తనపై అవినీతి కేసులు మోపేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధపడుతున్న వెనక్కి తగ్గడం లేదు. బాహటంగానే కూటమి ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు. ఇంకోవైపు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి ఢిల్లీలో వైసిపి వ్యవహారాలు చూస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఆయన పాత్ర పోషిస్తున్నారు.
భూమన కరుణాకర్ రెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో కూటమి అనుసరించిన వైఖరిని తీవ్రంగా దుయ్యబట్టారు. అంతకుముందు తిరుమల లడ్డు వివాదంతో పాటు తిరుపతిలో తొక్కిసలాట పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకడుగు వేయడం లేదు. మరోవైపు ఒంగోలుకు వెళ్లిపోయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సైతం తిరిగి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. కలిసి ఉంటే కలదు సుఖం అన్న మాదిరిగా వైసీపీ నేతలు అంతా ఏకతాటి పైకి వస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. తప్పకుండా పూర్వ వైభవం దిశగా చిత్తూరు జిల్లాలో పార్టీ ఎదుగుతుందని ఎక్కువమంది ఆశిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో?