ఏపీ రాజకీయాల్లో ఓ సంచలనం నమోదు కాబోతుందా? రాజకీయాలనే షేక్ చేయబోతుందా? ఓ అద్భుత కలయికకు గ్రౌండ్ వర్క్ పూర్తయిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ఏపీ చీఫ్ వైయస్ షర్మిల వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందుకు సంబంధించి ముహూర్తం కూడా ఖరారు అయినట్లు ప్రచారం నడుస్తోంది. మార్చి 12న ఆమె వైసీపీలో చేరబోతున్నారన్న వార్త సోషల్ మీడియా లో హల్చల్ చేస్తోంది. అదే జరిగితే ఏపీలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. సోదరుడు జగన్మోహన్ రెడ్డిని విభేదించి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు షర్మిల. జగన్ పై ఉన్న కోపంతో షర్మిలను ప్రయోగించింది కాంగ్రెస్ పార్టీ. ఆమెను ఏపీ చీఫ్ గా చేయాలన్న చంద్రబాబు విన్నపాన్ని మన్నించింది కాంగ్రెస్ అధినాయకత్వం. ఎన్నికల్లో ఎంతలా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయాలో అంతలా చేశారు షర్మిల. వైసిపి ఓడిపోయినా విడిచిపెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పై వ్యక్తిగత విమర్శల దాడి తగ్గించలేదు. అయితే ఉన్నట్టుండి ఇటీవల షర్మిల జగన్ పై విమర్శలు తగ్గించారు. కూటమిపై ఎక్కు పెడుతున్నారు. ఇటువంటి తరుణంలోనే ఆమె తిరిగి సోదరుడు జగన్ చెంతకు చేరుకుంటారని ప్రచారం ప్రారంభం అయింది. అటు కుటుంబ పరిస్థితులు సైతం అలానే కనిపిస్తున్నాయి.
జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ ఇటీవల మనసు మార్చుకున్నట్లు కనిపించారు. క్రిస్మస్ సందర్భంగా ఇడుపాలపాయలో జగన్మోహన్ రెడ్డితో ఆనందంగా గడిపారు. మొన్నటి విదేశీ పర్యటనలో సైతం విజయమ్మ కలుసుకున్నట్లు ప్రచారం సాగింది. అయితే భారీ ఓటమితో కలిసి ఉంటే కలదు సుఖం అని రాజశేఖర్ రెడ్డి కుటుంబ సన్నిహితులు వారందరినీ ఏకతాటిపైకి తెచ్చినట్లు సమాచారం. షర్మిల సైతం విభేదాలు మరచి అన్నతో కలిసేందుకు ఒప్పుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. అనవసరంగా కుటుంబ సభ్యులు కొట్టుకొని రాజకీయంగా డ్యామేజ్ చేసుకోవడం తగదని.. మీ అనైక్యత వల్లే చంద్రబాబు మరోసారి అధికారంలోకి రాగలిగారని కుటుంబ సన్నిహితులు ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడినట్లు సమాచారం. ఇప్పటివరకు జరిగింది ఒక ఎత్తు.. పాత విభేదాలు మరిచి.. కొత్త కలయికతో సరికొత్త రాజకీయాలు చేయాలని సన్నిహితులు సలహా ఇచ్చినట్లు సమాచారం. పనిలో పనిగా ఆస్తి వివాదాలకు సైతం పరిష్కార మార్గం చూపినట్లు తెలుస్తోంది. దీనిపై సంతృప్తి చెందిన షర్మిల వైసీపీలో చేరేందుకు సమ్మతించినట్లు ప్రచారం నడుస్తోంది. మార్చి 12న ఆమె వైసీపీలో చేరేందుకు ముహూర్తంగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఇటీవల వైసిపి కి గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి షర్మిలను కలిశారు. వారి మధ్య మూడు గంటల పాటు చర్చలు కొనసాగాయి. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయిరెడ్డి.. నేరుగా వెళ్లి షర్మిలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజశేఖర్ రెడ్డి కుటుంబ మనిషిగా విజయసాయి రెడ్డికి పేరు ఉంది. కుటుంబమంతా కలిసి ఉంటే బలం అని.. జగన్మోహన్ రెడ్డితో కలిస్తే 2029 ఎన్నికల్లో గెలుపు ఖాయమని విజయసాయిరెడ్డి షర్మిలకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని రకాల రాజీ ఫార్ములాలను సైతం ఆమెకు వివరించినట్లు సమాచారం. జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తే వచ్చే ప్రయోజనాలను సైతం ఆమెకు చెప్పినట్లు టాక్ నడుస్తోంది. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారని.. అటు తరువాత కుటుంబ సన్నిహితులు ఎంటర్ అయి ఆమెను ఒప్పించినట్లు సమాచారం. దీంతో వైసీపీలో చేరేందుకు షర్మిల అంగీకరించినట్లు తెలుస్తోంది.
షర్మిల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఏపీలో రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఊపిరి పోసేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే పార్టీకి కీలక నేతలు గుడ్ బై చెబుతున్నారు. ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. జగన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కూటమి పావులు కదుపుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డికి షర్మిల అండగా నిలబడితే మాత్రం.. వైసిపి అధినేత ప్రజల్లోకి బలంగా వెళ్ళగలరు. ప్రజల్లో ఆలోచన తేగలరు. అయితే షర్మిల వైసీపీకి దగ్గరవుతున్నారన్న వార్త కూటమిలో ఆందోళన రేపుతోంది. అన్నా చెల్లెలు కలిస్తే మాత్రం తమకు కష్టమన్న ఆందోళన కూటమి పార్టీ నేతల్లో కనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.