Sunday, January 26, 2025

మంగళగిరి వైసీపీలో ఏం జరుగుతుంది…? నియోజకవర్గంలో గెలిచేదెవరు..?

- Advertisement -

వచ్చే ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే అన్ని నియోజకవర్గాలు కూడా ఒక ఎత్తు అయితే.. ఆ ఒక్క నియోజకవర్గం మాత్రం మరో ఎత్తు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఆ నియోజక వర్గం మరేదో కాదు.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం. గత ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంపైనే అందరి కళ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే 2019లో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచే టీడీపీ అధినేత కుమారుడు నారా లోకేష్ బరిలోకి దిగారు. వైసీపీ నుంచి 2014లో విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణరెడ్డినే తిరిగి పోటీ చేసి విజయం సాధించారు. అమరావతి రాజధాని చేయడం..టీడీపీ అధికారంలో ఉండటం అన్ని కూడా కలిసి మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధిస్తారని భావించారు. కాని మంగళగిరి నియోజకవర్గం వైసీపీ వ్యూహాలు ముందు నారా లోకేష్ నిలబడలేపోయారు.

వైఎస్ ఫ్యామిలీ మొత్తం కూడా ఆళ్ల రామకృష్ణరెడ్డి తరుఫున ప్రచారం చేయడం.. ఆయనకు నియోజకవర్గంలో మంచి పేరు ఉండటం.. ఆళ్ల రామకృష్ణరెడ్డి గెలిస్తే.. మంత్రిని చేస్తానని హామీ ఇవ్వడం అన్ని గలకలిసి గత ఎన్నికల్లో నారా లోకేష్ మీద ఆళ్ల రామకృష్ణరెడ్డి విజయం సాధించేలా చేశాయి. కాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంగళగిరి నియోజకవర్గం మొత్తం కూడా ఒక్కసారిగా మారిపోయినట్లుగా కనిపిస్తుంది.రాజధానిని అమరావతి నుంచి తరలించడం..ఆళ్ల రామకృష్ణరెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం.. ఇలా పలు సమస్యలతో అధికార వైసీపీ నియోజకవర్గంలో తీవ్ర సమస్యను ఎదుర్కొనేలా చేస్తున్నాయి. దీనికి తోడు మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ , జనసేనలు తమ అధిపత్యాన్ని నిరుపించుకోవాలని చూస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా తాను మంగళగిరి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని నారా లోకేష్ ప్రకటించారు. దీంతో వైసీపీ పార్టీ తమ వ్యూహాలకు మరింత పదును పెట్టినట్లుగా కనిపిస్తుంది.

చేనేత సామాజికవర్గానికి చెందిన మురుగుడు హనుమంతరావును పార్టీలో చేర్చుకుని ఆయనకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. అంతేకాకుండా చేనేత సామాజికవర్గానికే చెందిన మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మంగళగిరి టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న గంజి చిరంజీవిని కూడా వైసీపీ పార్టీలో చేర్చుకుని టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చింది. గంజి చిరంజీవిని వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా ప్రకటించి సంచలనం సృష్టించింది. అటు టీడీపీ కూడా వైసీపీకి ధీటుగానే వ్యూహాలను రచిస్తోంది. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డిని టీడీపీలో చేర్చుకుని అధికార పార్టీకి దిమ్మ తిరిగే షాకిచ్చింది.

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి గతంలో కలిసి వచ్చిన అంశాలు ఏమి కూడా ఇప్పుడు ఆయనకు కలిసి రావడం లేదని తెలుస్తోంది. దీనికి తోడు ఆయన మీద వ్యతిరేకత కూడా వ్యక్తం అవుతున్నట్లుగా తెలుస్తోంది. అయినప్పటికి కూడా నారా లోకేష్ మళ్లీ మంగళగిరిలో పోటీ చేస్తే కనుక ఆళ్ల రామకృష్ణారెడ్డినే విజయం సాధిస్తారని సంకేతాలు వెలువడుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గాన్ని అంత ఈజీగా వదులుకోవడానికి వైసీపీ కూడా సిద్దంగా లేదనిపిస్తోంది. తమ శయశక్తుల పోరాడి మరోసారి ఇక్కడ విజయం సాధించాలని జగన్ భావిస్తున్నారు. ఇటు టీడీపీ నాయకులు కూడా నారా లోకేష్‌ను మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇన్ని రాజకీయ పరిణామాల మధ్య మంగళగిరి నియోజకవర్గం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. మరి అక్కడ ఈసారి ఎవరు విజయం సాధిస్తారో అని రాష్ట్ర ప్రజలందరు కూడా ఆసక్తికరంగా మారింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!