2024లో రాబోవు ఎన్నికలను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వైసీపీ అధినేత. ఎట్టి పరిస్థుతుల్లో తిరిగి అధికారంలోకి వచ్చేలా పావులు కదుపుతున్నారాయన. దీనిలో భాగంగానే ఇప్పటికే పలు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తుంది. టీడీపీ బలంగా ఉన్న చోట్ల సరైన అభ్యర్థులను రంగంలోకి దించి వారిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారాయన. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా ఫ్యాన్ గాలి వీచింది. కాని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం..టీడీపీ కాస్తో కూస్తో సీట్లను సాధించింది. అద్దంకి, చీరాల, పర్చూరు వంటి చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి మద్దతుగా నిలిచారు. పర్చూరులో టీడీపీ బలంగా ఉంది. అయితే అద్దంకిలో మాత్రం సరైన అభ్యర్థి లేకపోవడంతోనే 2019 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిందని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
2014లో జరిగిన ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీనే గెలిచింది. ఆ ఎన్నికల్లో వైసీపీ తరుఫున పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించారు. కాని 2016లో ఆయన పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో గొట్టిపాటి రవికుమార్‌నే టీడీపీ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. జగన్ ప్రభంజనంలో కూడా గొట్టిపాటి రవికుమార్ విజయం సాధించడం విశేషం. అయితే సరైన అభ్యర్థి లేకపోవడంతో ఓడిపోయామని వైసీపీ కార్యకర్తలు ఆవేదన చెందుతున్నారు. అందుకే సీఎం జగన్ ఈ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే నియోజకవర్గ బాధ్యతలను ‘బాచిన కృష్ణచైతన్య’ను అద్దంకి నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జిగా నియమించారు. బాధ్యతలను తీసుకున్నప్పటి నుంచి కూడా బాచిన కృష్ణచైతన్య నియోజకవర్గంలోనే కలియతిరుగుతున్నారు.
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో బాచిన కృష్ణచైతన్యకు విశేషమైన స్పందన లభిస్తోంది. వైసీపీ పార్టీ కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి, అధికారిక కార్యక్రమాలన్నీ కృష్ణచైతన్య పక్కా ప్లాన్‌తో నిర్వహిస్తు నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే గొట్టిపాటికి సరైన మొగుడు వచ్చాడని నియోజకవర్గంలో ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఐప్యాక్ చేసిన సర్వేతో పాటు, పార్టీ అంతర్గత సర్వేలో కూడా బాచిన కృష్ణచైతన్య విజయం ఖాయం అని రావడంతో…ఆయనకే టిక్కెట్ ఇవ్వడానికి కూడా పార్టీ అధినేత కూడా రెడీ అయినట్లుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే.. ఇటీవల బాచిన కృష్ణచైతన్యను సీఎం క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించుకుని మరి జగన్ ఆయనతో మాట్లాడినట్లుగా సమాచారం అందుతుంది. అసమ్మతి లేకుండా పార్టీని ఏకతాటిపైకి తెస్తున్న కృష్ణచైతన్యను జగన్ అభినందించారు. వచ్చే ఎన్నికల్లో ఇంకా బాగా పని చేయలని.. టిక్కెట్ నీకు ఇస్తున్నాం అని బాచిన కృష్ణచైతన్యతో జగన్ తెలిపినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో అద్దంకి టిక్కెట్ బాచిన కృష్ణచైతన్యకు ఖన్ఫార్మ్ చేసినట్లు అయింది. మరి గొట్టిపాటికి బాచిన కృష్ణచైతన్య ఎలా చెక్ పెడతారో చూడాలి.