ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే గడువుంది. ఇప్పటికే ఎన్నికల ఫీవర్ మొదలైంది. ఈసారి కూడా వైసీపీ గెలిస్తే ఇక తమ పార్టీలకు భవిష్యత్తు ఉండదని బెంగ పడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కళ్యాణ్. ఇద్దరూ ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వచ్చే శక్తి లేదు. ఈ విషయం వారికి బాగా తెలుసు. అందుకే, ఈసారి పొత్తు పెట్టుకొని ముందు వైసీపీని అధికారంలో నుంచి దించేయాలనే ఇద్దరు నేతలు గట్టి పట్టుదలగా ఉన్నారు. కాబట్టి, రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమైందనే చెప్పాలి.
అయితే, అధినేతలు కలిసినంత ఈజీగా పొత్తుల ద్వారా ఎన్నికలకు వెళ్లడం కుదరదు. ఇప్పటికే రెండు పార్టీల్లోనూ ఎమ్మెల్యేల టిక్కెట్లు ఆశిస్తున్న వారు ఈ పొత్తులను అంత సులువుగా అంగీకరించలేరు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌కు బలం, ఆయన సామాజకవర్గం ఎక్కువగా ఉన్నది ఉభయ గోదావరి జిల్లాల్లో. ఆ తర్వాత విశాఖపట్నం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కొంతమేర పవన్ కళ్యాణ్‌కు బలముంది. కాబట్టి, పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అడిగినా అవి ఈ జిల్లాల నుంచే అడుగుతారు. ఈ జిల్లాలు కాకుండా కడపలోనో, కర్నూలులో జనసేనకు సీట్లు కేటాయించే అవకాశం ఉండదు. ఒకవేళ అలా కేటాయించినా ఓడిపోయే సీట్లు పవన్ కళ్యాణ్‌కు ఇచ్చారనే భావన క్యాడర్‌లోకి వెళ్తుంది.
పొత్తులో భాగంగా జనసేన కనీసం 40 సీట్లు డిమాండ్ చేసే అవకాశం ఉంది. చంద్రబాబు ఎలాగోలా బుజ్జగించి, బతిమిలాడి పాతిక సీట్లకు ఒప్పటించే ప్రయత్నం చేయవచ్చు. ఇంత కంటే తక్కువ సీట్లు తీసుకుంటే పవన్ కళ్యాణ్ బలం ఇంతేనా ? ఇన్ని తక్కువ సీట్లు ఇస్తారా ? అనే ఆగ్రహం జనసైనికుల్లో వ్యక్తం అవుతుంది. కాబట్టి, పరువు నిలుపుకునేలా కనీసం పాతిక సీట్లు పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సి రావచ్చు. ఈ 25 సీట్లలో కనీసం 20 సీట్లు ఉభయ గోదావరి, విశాఖపట్నం, కృష్ణ జిల్లాలోనే ఉంటాయి. మిగతా ఐదు సీట్లు తెనాలి, తిరుపతి, నెల్లూరు సిటీ లాంటి సీట్లు ఉండొచ్చు.
అయితే, ఇప్పటికే ఈ అన్ని సీట్లలో తెలుగుదేశం పార్టీకి కూడా చాలా వరకు అభ్యర్థులు ఉన్నారు. కొన్ని చోట్ల ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పని చేస్తున్న వారు ఉన్నారు. వీరు టిక్కెట్‌పై ఆశతో ఇప్పటికే డబ్బును, శ్రమను, సమయాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే జనసేనకు కేటాయించిన సీట్లలో టీడీపీ నేతలకు చంద్రబాబు హ్యాండ్ ఇవ్వడం ఖాయం. ఇలాంటి విషయాల్లో చంద్రబాబు ఏమాత్రం వెనుకా ముందు కూడా ఆలోచించరు. ఈ సంగతి టీడీపీ నేతలకు బాగా తెలుసు. అందుకే, పొత్తు కుదిరితే తమకు టిక్కెట్లు గల్లంతేనని దాదాపు 20 మంది టీడీపీ కీలక నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పటికే గత ఎన్నికల్లో జనసేనకు ఎక్కువగా ఓట్లు ఏయే నియోజకవర్గాల్లో వచ్చాయో చూసుకుంటున్న టీడీపీ నేతలకు జనసేనకు కేటాయించే సీట్లపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఏయే సీట్లు జనసేనకు వెళ్తాయో వారికి అర్థమైంది. ఈ నేపథ్యంలో తమకు సీట్లు దక్కవని నిర్ధారణకు వచ్చిన తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్ నేతలతో టచ్‌లోకి వెళ్లి సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తున్నది. తమకు టిక్కెట్ హామీ ఇస్తే వెంటనే వైసీపీలో చేరతామని ఆగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 10 మంది టీడీపీ ఆశావహులు ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఈ జిల్లాల్లో కొంతమంది వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలను జగన్ ఈసారి మారుస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఈ నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు వైసీపీ ముఖ్య నేతలను కోరుతున్నట్లు సమాచారం. రానున్న నెలా, రెండు నెలల్లో ఈ చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇదే జరిగే పొత్తులను నమ్ముకుతున్న తెలుగుదేశం పార్టీ పుట్టి మునిగిపోయే ప్రమాదం ఉంది