Thursday, December 12, 2024

Telangana:బండి సంజయ్ కే బీజేపీ తెలంగాణ పీఠం.. సీరియస్ గా ఆలోచిస్తున్న హైకమాండ్

- Advertisement -

Telangana:బండి సంజయ్..ఈ పేరు వింటేనే బీజేపీ శ్రేణులకు ఒక టానిక్ లా పనిచేసేది. అందుకే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అయితేనే కరెక్ట్ అంటున్నారు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే తెలంగాణలో బీజేపీ ప్రతి గడపకు పరిచయం అయ్యింది. తెలంగాణలో క్షేత్రస్థాయి నుంచి సీనియర్‌ల వరకు సంజయ్‌ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఒకప్పుడు బీజేపీ అంటే అదొక జాతీయ పార్టీ అనే అభిప్రాయం ఉండేది. కానీ సంజయ్‌కి బాధ్యతలు ఇచ్చాక బీజేపీ ఒక మహాశక్తి అనేలా తీర్చిదిద్దారు. కాగా ప్రస్తుతం బీఆర్ఎస్ బలహీనపడుతున్న వేళ కాంగ్రెస్‌కి కళ్ళెం వేయాలంటే బీజేపీ పుంజుకోవాలని కమలం కార్యకర్తలు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేసిఆర్‌కి కంటి మీద కనుకులేకుండా చేశారు సంజయ్‌. కానీ అనూహ్యంగా ఆయన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది బీజేపీ హైకమాండ్

తెలంగాణ భవిష్యత్తు బీజేపేనే అనేంతగా జవసత్వాలు కల్పించిన ఆయనను అనూహ్యంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు.మరోసారి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా బాధ్యతలను నిర్వర్తిస్తున్న బండి సంజయ్ కి.. మళ్లీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తే ఈసారి పార్టీని విజయ తీరాలకు చేర్చుతాడన్న విశ్వాసం కేడర్‌లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ నేతలు ఎవరికి వారు యమునా తీరు అనే విధంగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయం అంతా కాంగ్రెస్ కేంద్రంగా నడుస్తోంది. ఈ టైమ్‌లో సంజయ్‌ కు బాధ్యతలు అప్పగించాలని కార్యకర్తలు కోరుతున్నారు. రెండు పదవుల్లో ఉంటూ కేడర్‌కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటారనే నమ్మకాన్ని కార్యకర్తలు వ్యక్తపరుస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ పరిస్థితి నామమాత్రంగానే ఉన్న సమయంలో 2020 మార్చిలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సంజయ్ బాధ్యతలు తీసుకున్నారు. తనదైన దూకుడుతో రాష్ట్రంలో పార్టీని పరుగులు పెట్టించారు. దీంతో రాష్ట్రంలో పార్టీకి గ్రాఫ్, ప్రజల్లో ఆదరణ, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరిగాయి. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గట్టి ప్రభావమే చూపించే ఆస్కారముందనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అనూహ్యంగా ఎన్నికల ముంగిట.. జులైలో సంజయ్ ను తప్పించి తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని హైకమాండ్ నియమించింది. దీంతో రాష్ట్ర బీజేపీలో కలకలం రేపింది. కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకే బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలే అసంత్రుప్తి వ్యక్తం చేశారు. అంతే కాకుండా కొంతమంది బీజేపీని వీడి వెళ్లారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ 8 చోట్ల గెలిచింది. గతంతో పోలిస్తే ఆ పార్టీకి సీట్లు పెరిగాయి. ఓట్ల శాతం కూడా పెరిగింది. కానీ బీఆర్ఎస్, కాంగ్రెస్ కు ఓటు వేయడం ఇష్టం లేక చాలా మంది బీజేపీ వైపు మొగ్గు చూపారు. అదే బండి సంజయ్ అధ్యక్షుడిగా కొనసాగి ఉంటే రాష్ట్రంలో బీజేపీ మరో 20కి పైగా స్థానాల్లో గెలిచేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. బీఆర్ఎస్ గెలుస్తుందనుకుంటే కాంగ్రెస్ నెగ్గింది. అందుకే బీజేపీ అధిష్ఠానానికి తప్పు తెలుసొచ్చింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పు పార్టీకి ఎంతటి నష్టం చేసిందో ఇప్పుడు అర్థమైనట్లుంది. జాతీయ స్థాయిలో పార్టీ ప్రయోజనాల కోసం ఇక్కడ కేసీఆర్ కు అనుకూలంగా ఉండేందుకు బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు మార్చబోతోంది. మళ్లీ తెలంగాణ పగ్గాలు బండి సంజయ్ కే అందించేందుకు బీజేపీ హైకమాండ్ సిద్ధమైందని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.ఒక వేళ బండి సంజయ్ బీజేపీ అధ్యక్షడు అయితే మాత్రం అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీని ఒక చెడుగుడు ఆడుకునే అవకాశముంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!