ఆ నియోజకవర్గం టిడిపికి కంచుకోట. మధ్యలో కాంగ్రెస్ పార్టీ సైతం గెలుస్తూ వచ్చింది. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన ఆ స్థానాన్ని గెలుచుకుంది. అయితే సంస్థగతంగా అక్కడ టిడిపి బలంగా ఉంది. ఆ పై టిడిపి ఇన్చార్జ్ కు రాష్ట్రస్థాయి కార్పొరేషన్ పదవి దక్కింది. ఆది నుంచి ఆయనకు మంచి పట్టు ఉంది. కూటమి ఊపులో జనసేన ఎమ్మెల్యే గెలిచారు. అయితే టిడిపి ఇన్చార్జ్ వర్సెస్ జనసేన ఎమ్మెల్యే అన్నట్టు పరిస్థితి మారింది. ఇంతకీ ఎవరు ఆ ఎమ్మెల్యే? ఏదా నియోజకవర్గం? అని తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.
విజయనగరం జిల్లా నెల్లిమర్లలో ఈసారి జనసేన జెండా ఎగిరింది. 2024 ఎన్నికల్లో ఇక్కడ జనసేన అభ్యర్థిగా బరిలో దిగిన లోకం మాధవి గెలిచారు. వాస్తవానికి ఇది టిడిపికి బలమైన నియోజకవర్గం. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరేసరికి చంద్రబాబు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. చంద్రబాబు ఆదేశాలతో టీడీపీ కేడర్ కూడా సహకరించింది. మంచి మెజారిటీతో గెలిచారు జనసేన అభ్యర్థి లోకం మాధవి.
2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బడ్డుకొండ అప్పలనాయుడు గెలిచారు. తెలుగుదేశం పార్టీకి చెందిన కురువృద్ధుడు పతివాడ నారాయణ స్వామి నాయుడు పై విజయం సాధించారు. అయితే వయోభారంతో నారాయణస్వామి నాయుడు ఉండడంతో నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు కర్రోతు బంగార్రాజుకు అప్పగించారు. పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు కర్రోతు. విజయనగరం జిల్లాలోని టిడిపి గెలుపు బాటలో ఉండే నియోజకవర్గంగా మలిచారు. కానీ అనూహ్యంగా జనసేన ఆ సీటు దక్కించుకుంది. దీంతో అగ్గి మీద గుగ్గిలం అవుతూ కర్రోతు తన అనుచరులతో చంద్రబాబును కలిశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం మంచి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అందుకు తగ్గట్టుగానే మార్క్ ఫెడ్ చైర్మన్ పదవి ఇచ్చారు.
అయితే లోకం మాధవి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. కానీ ఆమెకు పదివేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈసారి ఆమె గెలుపు వెనక టిడిపి క్యాడర్ ఉందన్నది బంగార్రాజు భావన. అయితే గెలిచింది మొదలు లోకం మాధవి టిడిపి శ్రేణులను పట్టించుకోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను పార్టీలో చేర్చుకొని టిడిపికి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అది మొదలు నెల్లిమర్ల నియోజకవర్గం లో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
నెల్లిమర్ల నగర పంచాయతీ సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే లోకం మాధవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అదే సమావేశానికి మార్క్ఫెడ్ చైర్మన్ హోదాలో బంగార్రాజు వచ్చారు. ఈ సమావేశానికి అధికారికంగా మీరు ఎలా వస్తారు అని లోకం మాధవి ప్రశ్నించేసరికి షాక్ కు గురయ్యారు బంగార్రాజు. ఎమ్మెల్యే తీరుపై తీవ్రంగా ఆక్షేపించారు. గెలిపించింది తామైతే తమ మీద పెత్తనం చేస్తారా అంటూ గట్టిగానే నిలదీశారు. దీంతో ఇద్దరి నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఇరు పార్టీల హై కమాండ్ల దృష్టికి వెళ్లడంతో వారు పిలిచి సముదాయించారు.
అయితే ఎమ్మెల్యే హాజరయ్యే కార్యక్రమానికి మార్క్ఫెడ్ చైర్మన్ బంగారు రాజుకు ఆహ్వానం లేదు. ఆయన హాజరవుతున్న కార్యక్రమానికి జనసేన ఎమ్మెల్యేకు ఆహ్వానం లేదు. దీంతో నెల్లిమర్ల నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా మారింది. ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలోపేతం అవుతుంది. కానీ కూటమిలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. ఇంకోవైపు జనసేనలో చేరారు బొత్స సోదరుడు లక్ష్మణరావు. ఆయన సైతం చాప కింద నీరులా విస్తరిస్తున్నారు. మున్ముందు నెల్లిమర్ల నియోజకవర్గంలో విభేదాలు మరింత తారాస్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది.