పిఠాపురం వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమవుతోందా? ఈ మేరకు వర్మ మొగ్గు చూపుతున్నారా? కానీ ఒకే ఒక్క హామీ కోసం ఎదురు చూస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు వర్మ విషయంలో ప్రకటనలు చేశారు. తప్పకుండా వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సంకేతాలు ఇచ్చారు. కానీ వర్మ మాత్రం టిడిపిలో సీరియస్ గా పని చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే ఆయన టార్గెట్ కేవలం జనసేన మాత్రమే. తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు పార్టీని విడిచి పెట్టేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
గత కొద్ది రోజులుగా పిఠాపురంలో జరిగిన వ్యవహారాలు అందరికీ తెలిసిందే. ఎన్నికల్లో సీటు త్యాగం చేసి పవన్ కళ్యాణ్ గెలుపు కోసం కష్టపడ్డారు వర్మ. అయితే ఆ కష్టాన్ని గుర్తించలేదు జనసేన నేతలు. చివరకు పవన్ కళ్యాణ్ సైతం తనను నిర్లక్ష్యం చేయడంతో బాధపడుతున్నారు వర్మ. మరోవైపు జనసేన సెకండ్ క్యాడర్ తో పాటు ఫస్ట్ క్యాడర్ సైతం వర్మ విషయంలో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తోంది. అయితే ఈ అవమానాలు పడే కంటే పార్టీ మారడమే ఉత్తమమని వర్మ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
గతం మాదిరిగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే గెలిచే ఛాన్స్ లేదు. ఆ విషయం వర్మకు కూడా తెలుసు. తాను ఎన్ని అవమానాలకు గురైతే అన్ని రకాలుగా ప్రజల నుంచి సానుభూతి వస్తుందని వర్మ భావిస్తున్నారు. అందుకే ఎక్కడ లైన్ దాటి మాట్లాడడం లేదు. అలాగని తెలుగుదేశం పార్టీలో ఉంటే తనకు చాన్స్ రాదని వర్మకు తెలుసు. ఎందుకంటే పిఠాపురం ను శాశ్వత నియోజకవర్గంగా మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అందుకే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వర్మ టిడిపిలో ఉంటే తనకు కష్టం అని పవన్ కళ్యాణ్ కు సైతం తెలుసు. అందుకే పొమ్మనలేక పొగ పెడుతున్నారు. చంద్రబాబు ఎమ్మెల్సీ ఇవ్వడానికి సిద్ధపడిన పవన్ కళ్యాణ్ అడ్డుపడుతున్నారన్నది ఒక ప్రచారం.
అయితే వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమే. కానీ పిఠాపురం పై ఆశలు పెట్టుకున్నారు వంగా గీత. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఉన్నారు. ఆయన కుమారుడి కోసం పట్టుపట్టే అవకాశం ఉంది. అందుకే వర్మ సైతం వెనక్కి తగ్గుతున్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పదవి ఇచ్చి.. 2029 లో కానీ.. అంతకంటే ముందుగా జమిలీ ఎన్నికలు వచ్చినా.. వైయస్సార్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలన్నదే వర్మ డిమాండ్. కానీ తాడేపల్లి కార్యాలయం నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదని తెలుస్తోంది.
అయితే నిప్పు లేనిదే పొగ రాదు. వర్మ టచ్లోకి రానిది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడలేరు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్లగా ఉన్న అంబటి రాంబాబు, జూపూడి ప్రభాకర్ రావు, పేర్ని నాని లాంటి వారు వర్మ విషయంలో స్పష్టమైన ప్రకటనలు చేశారు. తప్పకుండా వర్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని సంకేతాలు ఇచ్చారు. అయితే ఆ చిన్నపాటి షరతులు అడ్డంకిగా ఉన్నాయన్నమాట.