vకడప జిల్లాలో సీన్ మారుతోంది. కూటమిలో విభేదాల పర్వం నడుస్తోంది. ఒక నేత అంటే మరో నేతకు పడని దుస్థితి. పులివెందులలో అయితే టిడిపి శ్రేణులు బహిరంగంగానే కొట్టుకుంటున్నాయి. ఆధిపత్య పోరుకు తెర లేపాయి. అక్కడ టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి వర్సెస్ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. ఇంకోవైపు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బిజెపి ఎమ్మెల్యేగా ఉంటూ పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ మధ్యన బిజెపి ఎంపీ సీఎం రమేష్ తో గొడవ పెట్టుకున్నారు. అంతకుముందు అనంతపురం టిడిపి నేత జెసి ప్రభాకర్ రెడ్డితో వివాదం నడిచింది ఆదినారాయణ రెడ్డికి. చివరకు అది సి ఎం ఓ వరకు చేరింది.
తాజాగా ఆదినారాయణ రెడ్డికి తన సోదరుడు కుమారుడు భూపేష్ రెడ్డితో తీవ్ర విభేదాలు పొడచుపాయి. ఆదినారాయణ రెడ్డి బహిరంగంగానే భూపేష్ రెడ్డి గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. వారసత్వంగా రాజకీయ చేయడం కాదు.. తన సొంత కాళ్లపై చేయాలని కామెంట్స్ చేశారు. తద్వారా తాను వేసిన ప్లాట్ఫామ్ ద్వారా రాజకీయాలు చేస్తున్నారని భూపేష్ రెడ్డి పై వ్యాఖ్యానించారు ఆదినారాయణ రెడ్డి.
వాస్తవానికి జమ్మలమడుగు టిడిపి అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖరారు చేశారు చంద్రబాబు. కానీ చివరి నిమిషంలో చక్రం తిప్పారు ఆదినారాయణ రెడ్డి. పొత్తులో భాగంగా జమ్మలమడుగు నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించేలా చేశారు. కడప పార్లమెంట్ స్థానానికి పంపించారు. ఈ విషయంలో చంద్రబాబు సైతం భూపేష్ రెడ్డికి అన్యాయం చేశారు.
జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి గెలిచారు. భూపేష్ రెడ్డి ఎంపీగా ఓడిపోయారు. కానీ గత ఐదేళ్లుగా జమ్మలమడుగులో టిడిపి బలోపేతానికి కృషి చేశారు భూపేష్ రెడ్డి. చివరిగా ఫలితం వస్తుందనుకున్న తరుణంలో ఎగిరేసుకుపోయారు ఆదినారాయణ రెడ్డి. పోనీ కూటమి అధికారంలోకి వచ్చింది కదా నామినేటెడ్ పదవి ఇస్తారని భావించారు భూపేష్ రెడ్డి. దానిని కూడా అడ్డుకుంటున్నారు ఆదినారాయణ రెడ్డి.
ఆదినారాయణ రెడ్డితో ఎంపీగా పోటీ చేయించాలన్నది కూటమి వ్యూహం. 2019లో ఇదే ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేశారు. 2024 ఎన్నికల్లో అదే జరుగుతుందని అంతా భావించారు. కానీ ఎంపీగా పోటీ చేస్తే ఓటమి తప్పదని ఆదినారాయణ రెడ్డికి తెలుసు. అందుకే తన అన్న కుమారుడు భూపేష్ రెడ్డిని బలిపశువు చేశారు.
తాజాగా కడప టిడిపి జిల్లా అధ్యక్షుడిగా భూపేష్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో ఎంపీగా ఓడిపోవడంతో ఆయనపై హై కమాండ్ ప్రత్యేక దృష్టితో ఉంది. అయితే భూపేష్ రెడ్డికి టిడిపి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకుండా ఆదినారాయణ రెడ్డి తెరవెనుక పావులు కదుపుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో తన వారసుడిగా భూపేష్ రెడ్డి రాజకీయాల్లో నిలదొక్కుకోకూడదని భావిస్తున్నారు ఆదినారాయణ రెడ్డి. మొత్తానికి అయితే సొంత అన్న కుమారుడికి ఎసరు పెడుతున్నారు ఆదినారాయణ రెడ్డి.
తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఘనత ఆదినారాయణ రెడ్డి ది. 2009లో దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి ప్రోత్సహించారు. జమ్మలమడుగు టిక్కెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచిన ఆదినారాయణ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. 2014లో జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలిచారు ఆదినారాయణ రెడ్డి. కానీ కొద్ది రోజులకే టిడిపిలోకి ఫిరాయించారు. అక్కడ మంత్రి పదవి దక్కించుకున్నారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా కడప పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే టిడిపి నుంచి బిజెపిలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో పొత్తులో భాగంగా జమ్మలమడుగు టికెట్ సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచి విప్ గా పదవి పొందారు. అయితే ఆదినారాయణ రెడ్డి నిష్క్రమణతో టిడిపి బాధ్యతలు చూసిన భూపేష్ రెడ్డికి మాత్రం ఎటువంటి న్యాయం చేయలేకపోయారు చంద్రబాబు.