ఆయన మామూలోడు కాదు. పేరుకే ఎస్సై కానీ నెట్వర్క్ చాలా పెద్దది. పెద్దపెద్ద ఐపీఎస్ అధికారుల స్థాయి అయినది. అందుకే సాక్షాత్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైనే విరుచుకుపడ్డారు. జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేశారు. నిజంగా అది ధైర్యమే. కానీ ఆ ధైర్యం వెనుక ఉన్నది మాత్రం అధికార టిడిపి నేతలు. సోషల్ మీడియాలో దీనిపైనే తెగ ప్రచారం జరుగుతోంది. రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ అసలు బాగోతం బయటపడుతోంది.
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గం రాయలసీమలోనే హాటెస్ట్. ఇక్కడ ఎప్పుడూ రాజకీయాలు దూకుడుగా ఉంటాయి. అటువంటి నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్నారు ఎస్సై సుధాకర్ యాదవ్. రామగిరి మండల పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా ఉన్న సుధాకర్ యాదవ్ యూనిఫామ్ వేసుకున్న అసలు సిసలైన టిడిపి కార్యకర్త. కానీ తాము ప్రజల కోసమే పని చేస్తామని ధైర్యంగా చెబుతున్నారు. తమకు రాజకీయాలు ఆపాదించవద్దని సెంటిమెంట్ మాటలు చెప్పుకొస్తున్నారు. కానీ టిడిపి పెద్దలతో ఆయనకు మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే జగన్మోహన్ రెడ్డి పై కూడా సవాల్ చేసే పరిస్థితికి ఆయన వచ్చారు.
ఇటీవల రామగిరి మండలం లో జరిగిన రాజకీయ పరిణామాలు దుమారం రేపాయి. మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఎస్సై ప్రమేయం అధికం అయింది. 9 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఒకే ఒక్కరు టిడిపి సభ్యులు ఉన్నారు. కానీ మిగతా ఎనిమిది మంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యులను స్వయంగా ఎస్సై ప్రలోభ పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపైనే తాజాగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి. ఎస్సై ప్రలోభ పెట్టిన తీరును ప్రస్తావించారు. ఆయనపై చర్యలకు డిమాండ్ చేశారు.
ఇంకోవైపు రాప్తాడు నియోజకవర్గంలో లింగమయ్య అనే వైయస్సార్ కాంగ్రెస్ నేత హత్యకు గురయ్యారు. రాజకీయ ప్రత్యర్ధులు దారుణంగా ఆయనను హత్య చేశారు. అయితే టిడిపి నేతల హస్తం ఉందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. అసలైన నిందితులను వదిలి పెట్టారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్వయంగా రాప్తాడు వచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ రెండు ఘటనల్లో రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ పాత్ర పై జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానాలు చేశారు. వెంటనే సెల్ఫీ వీడియో తీసి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరికలు పంపినంత పని చేశారు ఎస్సై సుధాకర్ యాదవ్. దీనినే హైలెట్ చేస్తోంది ఎల్లో మీడియా. సుధాకర్ యాదవ్ పోలీస్ స్టోరీ లో సాయికుమార్ మాదిరిగా సిన్సియర్ ఆఫీసర్ అంటూ చెప్పే ప్రయత్నం చేస్తోంది.
అయితే సుధాకర్ యాదవ్ తెరవెనుక బాగోతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టిడిపి యువనేత నారా లోకేష్, మంత్రులు అచ్చం నాయుడు, సత్య కుమార్ యాదవ్, పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్.. ఇలా టిడిపి కీలక నేతలతో సహచర నాయకుడిగా మారిపోయిన ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. దీంతో మన వాడి వెనుక ఇంత కథ ఉందా అన్న చర్చ అయితే మాత్రం బలంగా జరుగుతుంది.