కమ్మ సామాజిక వర్గంలో బలమైన చర్చ ప్రారంభం అయ్యింది. ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టుతో ఒక రకమైన వాదన తెరపైకి వస్తోంది. రాజకీయాల కోసం కమ్మ సామాజిక వర్గాన్ని బలి పెడుతున్నారని ఆ సామాజిక వర్గం వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు సమయంలో కమ్మ సామాజిక వర్గం బాధపడింది. 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉండడంతో తట్టుకోలేకపోయింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు ఏకతాటిపైకి వచ్చారు. ఈసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కమ్మ సామాజిక వర్గం ఉండదనే వాదనను తెరపైకి తెచ్చారు. ఆర్థికంగా తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి గెలిచింది.
అయితే ఇప్పుడు అరెస్టుల తీరు చూస్తుంటే మాత్రం కమ్మ సామాజిక వర్గంలో కంగారు ప్రారంభం అయింది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇక్కడి రాజకీయాలను వదిలి వెళ్ళిపోయారు వల్లభనేని వంశీ మోహన్. గన్నవరం నియోజకవర్గాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఒకానొక దశలో ఆయన అమెరికా వెళ్లిపోయారని కూడా ప్రచారం నడిచింది. అనారోగ్యంతో బాధపడుతుండడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సరిగ్గా ఎటువంటి సమయంలోనే వల్లభనేని వంశీని అరెస్టు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.
అయితే కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి వారిని అరెస్టు చేయడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. వైసీపీలో దూకుడు కనబరిచిన ఇతర సామాజిక వర్గం నేతలను ఎందుకు టచ్ చేయడం లేదన్నది కమ్మ సామాజిక వర్గం నుంచి వస్తున్న ప్రశ్న. కూటమిలో కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాల వారికి ప్రాధాన్యమిస్తున్నారని ఇప్పటికే కమ్మ సామాజిక వర్గంలో అసంతృప్తి ఉంది. పార్టీ కోసం పనిచేసిన కమ్మ నాయకుల సైతం సైలెంట్ అయిపోయారు. అయితే వల్లభనేని వంశీ చంద్రబాబు కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వాస్తవం. గత ఐదేళ్లుగా అదే పనిగా కామెంట్స్ చేయడం నిజం. అయితే అంతకుమించి వ్యాఖ్యలు చేసిన ఇతర సామాజిక వర్గం నేతలు కూడా ఉన్నారు. అటువంటి వారిని విడిచిపెట్టి కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన వల్లభనేని వంశీని మాత్రమే టార్గెట్ చేయడం ఏమిటనే ప్రశ్న వినిపిస్తోంది.
వాస్తవానికి రాజకీయాలకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో వల్లభనేని వంశీ ఉన్నారట. అదే విషయాన్ని తన సామాజిక వర్గ పెద్దల వద్ద ప్రస్తావించారట. జరిగిందేదో జరిగిపోయింది ఇక నుంచి తాను రాజకీయాల జోలికి వెళ్ళనని చెప్పారట. అదే విషయాన్ని కమ్మ సామాజిక వర్గం పెద్దలు ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. అయితే ఇవేవీ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ పెద్దలు వల్లభనేని వంశీని టార్గెట్ చేశారట. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆవేదన వ్యక్తం కావడానికి ఇదే కారణం మాట. నాడు చంద్రబాబు అరెస్టు సమయంలో ఎంతో బాధపడ్డామని.. కానీ ఇప్పుడు వైసీపీలో ఇతర సామాజిక వర్గం నేతలను విడిచిపెట్టి.. కమ్మ సామాజిక వర్గం నేతల పై మాత్రమే టార్గెట్ చేయడం ఏమిటని.. సామాజిక వర్గ పెద్దల్లో ఒక రకమైన బాధ వ్యక్తం అవుతోంది.
కమ్మ సామాజిక వర్గంలో ఒక రకమైన చేంజ్ కూడా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ కోసం పరితపించామని.. కానీ ఇప్పుడు సామాజిక వర్గాన్ని నాయకత్వం పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి జగదీష్, కోడెల శివప్రసాద్ తనయుడు.. ఇలా చాలామంది ఆవేదనతో ఉన్నారు. మరోవైపు చింతమనేని ప్రభాకర్ లాంటి నేతలు సొంత సామాజిక వర్గ నేత.. అబ్బయ్య చౌదరిపై విరుచుకు పడడంపై కూడా వారు ఆవేదనతో ఉన్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే కమ్మ సామాజిక వర్గం క్రమేపి తెలుగుదేశం పార్టీకి దూరమైన ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు