నెల్లూరు టిడిపిలో విభేదాలు ప్రారంభం అయ్యాయా? టిడిపి నేతల తీరుపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆగ్రహంగా ఉన్నారా? ముఖ్యంగా మంత్రి నారాయణతో ఆయన విభేదిస్తున్నారా? వైసీపీలోనే గౌరవంగా ఉండేదని సన్నిహితుల వద్ద చెబుతున్నారా? ఇలానే కొనసాగితే కోటంరెడ్డి తిరుగుబాటు చేయడం తద్యమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ముఖ్యంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ కోసం అన్నీ చేశానని.. నెల్లూరు జిల్లాలో టిడిపి గెలుపునకు తానే కారణమని.. అటువంటి తనను టిడిపి హై కమాండ్ పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ప్రధానంగా మంత్రి నారాయణతో కోటంరెడ్డికి విభేదాలు ప్రారంభం అయ్యాయి. సీఎం చంద్రబాబు వద్ద పంచాయతీ జరిగిన సమసి పోలేదు. ప్రభుత్వంలో మంత్రి నారాయణ కీలక పాత్ర పోషిస్తుండడంతో కోటంరెడ్డి పై చేయి సాధించలేకపోతున్నారు.
ప్రధానంగా నెల్లూరు కార్పొరేషన్ విషయంలో ఇద్దరు నేతల మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో 54 డివిజన్లో ఉన్నాయి. నెల్లూరు సిటీ తో పాటు రూరల్ నియోజకవర్గంలో చెరి సగం డివిజన్లు కొనసాగుతున్నాయి. ఈ లెక్కన కార్పొరేషన్ పై కూడా రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న శ్రీధర్ రెడ్డి కి ప్రాధాన్యం దక్కాలి. కానీ ఇక్కడ మంత్రి నారాయణ పూర్తిస్థాయి పట్టు బిగిస్తున్నారన్న కామెంట్స్ ఉన్నాయి. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో తన అనుమతి లేకుండా ఏ పని చేయవద్దని మంత్రి నారాయణ ఆదేశించినట్లు సమాచారం. దీంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట అస్సలు చెల్లుబాటు కావడం లేదు. కనీసం చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నారు కోటంరెడ్డి. దీంతో సన్నిహితుల వద్ద తెగ బాధ పడిపోతున్నారు.
దాదాపు రెండు సంవత్సరాల ఎమ్మెల్యే పదవీ కాలాన్ని వదులుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో విభేదించారు కోటంరెడ్డి. నెల్లూరు జిల్లాలో వైసీపీ నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. తద్వారా ఆ పార్టీలో చీలికకు కారణమయ్యారు. తెలుగుదేశం పార్టీ గెలుపునకు దోహదపడ్డారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న గౌరవం కూడా.. తెలుగుదేశం పార్టీలో దక్కడం లేదన్న ఆందోళనతో కోటంరెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. అవసరం అయితే వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వం పై మాదిరిగానే తిరుగుబాటు చేస్తానని కూడా సన్నిహితుల వద్ద చెబుతున్నట్లు సమాచారం.
కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలు అవుతోంది. కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి ఎటువంటి ప్రాధాన్యం దక్కడం లేదు. నామినేటెడ్ పదవులు విషయంలో కూడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. తనతో పాటు టిడిపిలో చేరిన సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. తనకు మాత్రం కనీస స్థాయిలో కూడా చిన్న పదవి కూడా కల్పించలేదు. అభివృద్ధి పనుల్లో కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఇప్పుడు మంత్రి నారాయణ రూరల్ నియోజకవర్గం పై పెత్తనం చేస్తున్నారు. కార్పొరేషన్ లో సగభాగంగా ఉన్న రూరల్ నియోజకవర్గాన్ని పరిగణలోకి తీసుకోవడం లేదు. కనీసం నెల్లూరు కార్పొరేషన్ లో అధికారులు, ఉద్యోగుల బదిలీల్లో కూడా కోటంరెడ్డి మాట చెల్లుబాటు కావడం లేదు. దీంతో ఆయన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం ఆయన తిరుగుబాటు చేయడం ఖాయం