Wednesday, March 19, 2025

వైసీపీలోకి ఆ మాస్ లీడర్స్.. ముహూర్తం ఫిక్స్!

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా వివిధ పార్టీల్లో ఉండే నాయకులు, తటస్తులు పెద్ద ఎత్తున వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైసీపీలో చేరిపోయారు. ఈ జాబితాలో మరో ఆరుగురు పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు మాస్ లీడర్స్ సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉగాది తర్వాత జిల్లాల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. అంతకుముందు అన్ని జిల్లాల వైసీపీ స్థానిక ప్రజాప్రతినిధులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవుతున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితిలు, నాయకుల స్థితిగతులు అడిగి తెలుసుకుంటున్నారు. ఇతర పార్టీల కు చెందిన నాయకుల విషయాన్ని ఆరా తీస్తున్నారు. ప్రజల్లో పలుకుబడి ఉన్న నాయకుల విషయంలో ప్రత్యేకంగా ఆరా తీసే పనిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా మాస్ లీడర్స్ పై దృష్టి పెట్టినట్లు సమాచారం.

అనంతపురం జిల్లాలో కూటమి బలంగా ఉంది. అక్కడ బలం పెంచుకునే పనిలో పడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఈ తరుణంలో బలమైన నేతలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో రఘువీరారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అనంతపురంలో సీనియర్ మోస్ట్ లీడర్ ఆయన. 1985 నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది. పైగా వైయస్ రాజశేఖర్ రెడ్డి అంటే అత్యంత విధేయత చూపిన నాయకుడు రఘువీరారెడ్డి. అటువంటి వ్యక్తి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే పార్టీకి ఒక ఊపు వచ్చే అవకాశం ఉంది.

ఇంకోవైపు కాపు రామచంద్రారెడ్డి సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. ఎన్నికలకు ముందు అనూహ్య పరిస్థితుల్లో బిజెపిలోకి వెళ్లిపోయారు కాపు రామచంద్రారెడ్డి. ఈ ఎన్నికల్లో టికెట్ నిరాకరించారు జగన్మోహన్ రెడ్డి. రాయదుర్గం నుంచి వేరే నేతకు చాన్స్ ఇచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న తనను పక్కన పెట్టడంపై మనస్థాపానికి గురయ్యారు కాపు రామచంద్రారెడ్డి. భారతీయ జనతా పార్టీలో చేరారు. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదు. అందుకే ఆయన యూటర్న్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా గెలిచారు కాపు రామచంద్రారెడ్డి. మంచి మాస్ ఇమేజ్ ఉన్న నేత. అందుకే ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం.

అయితే అనంతపురం జిల్లాకు చెందిన ఈ ఇద్దరు నేతలు ఉగాది రోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలుస్తోంది. ఇప్పటికే వారు వైసీపీ నాయకత్వంతో చర్చలు జరిపారని.. అన్ని సానుకూలంగా పూర్తయ్యాయని తెలుస్తోంది. ఉగాదికి వీరు చేరితే.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. అయితే మొన్న సాకే శైలజానాథ్, ఉగాదికి ఆ ఇద్దరు నేతలు చేరనుండడంతో అనంతపురం జిల్లా రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులు వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!