విజయసాయి రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లోకి రానుందా? ఆయన కుమార్తె నేహా రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆమె రాజ్యసభ పదవిపై కన్నేశార? ఈ వార్తలో నిజం ఎంత? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ వేదికగా ప్రచారం తీవ్రంగా ఉంది. దీంతో ఇది ప్రాధాన్యత అంశంగా మారింది. వైసీపీలో నెంబర్ 2 గా ఉండేవారు విజయసాయిరెడ్డి. ఆయన ఉన్నపలంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ పార్టీ సభ్యత్వంతో పాటు పదవులను వదులుకున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని సైతం త్యాగం చేశారు. ఇకనుంచి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటారని కూడా చెప్పుకొచ్చారు.
అయితే విజయసాయిరెడ్డి రాజీనామా వెనుక కూటమి వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడిచింది. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ఒత్తిడి ఉన్నట్లు టాక్ ఉంది. అదే సమయంలో విజయసాయిరెడ్డి వ్యవహార శైలి పై కూడా అనుమానాలు ఉన్నాయి. త్వరలో ఆయన బిజెపిలో చేరతారని కూడా ఢిల్లీ సర్కిల్లో చర్చ నడిచింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కుటుంబం కోసమే, కుటుంబం ఇబ్బందులు పడకూడదని ఉద్దేశంతోనే తాను వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. అటువంటిది ఇప్పుడు కుమార్తె నేహా రెడ్డి పేరు రాజ్యసభకు వినిపిస్తుండడం విశేషం.
విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్తగా ఉండేటప్పుడు విశాఖలో భూ దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా విజయసాయిరెడ్డి కుమార్తె నేహా రెడ్డి పేరుతో భారీగా భూములు కొనుగోలు చేశారని సొంత పార్టీ నేతలే అప్పట్లో ప్రచారం చేశారు. దీనిపై అధినేతకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతోనే విజయసాయిరెడ్డిని అప్పట్లో తప్పించారని కూడా టాక్ నడిచింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి కుమార్తె భూములపై అనేక రకాల విచారణలు కొనసాగాయి. అందుకే విజయసాయిరెడ్డి కూటమి వేధింపులు తట్టుకోలేక వైసీపీకి గుడ్ బై చెప్పారు అన్నది ఒక విశ్లేషణ.
అయితే తాజాగా నేహా రెడ్డి పేరును రాజ్యసభ పదవికి బిజెపి పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే అది ఏపీ నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆమెకు రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం నడుస్తోంది. ఈ ఒప్పందంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి గుడ్ బై చెప్పినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి. మొత్తానికి అయితే భారీ వ్యూహంతోనే విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టినట్లు తెలుస్తోంది. మరి మున్ముందు పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి