వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి విజయమ్మ రీఎంట్రీ ఇవ్వనున్నారా? మళ్లీ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవి చేపడుతారా? కుమారుడికి వెన్నుదన్నుగా నిలుస్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొద్ది రోజుల కిందట ఆమె గౌరవ అధ్యక్షురాలు పదవికి రాజీనామా చేశారు. కుమారుడికి చెప్పే పార్టీకి రిజైన్ ప్రకటించారు. పార్టీ కార్యకర్తల సమావేశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. తిరిగి ఆమె కుమారుడికి అండగా నిలవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైయస్ కుటుంబ అభిమానులు, ఆ కుటుంబాన్ని అభిమానించే నేతలు కూడా ఇదే కోరుకుంటున్నట్లు సమాచారం. వారి ప్రయత్నాలు సైతం కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సరికొత్త కళ రానుంది.
2011లో కాంగ్రెస్ పార్టీని విభేదించారు జగన్మోహన్ రెడ్డి. తండ్రి అకాల మరణంతో కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఇబ్బంది పెట్టింది. రాజశేఖర్ రెడ్డి మరణంతో చనిపోయిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడ్డారు. దానికి కాంగ్రెస్ నాయకత్వం అంగీకరించలేదు. పైగా కేసులతో భయపెట్టింది. 16 నెలలపాటు జగన్మోహన్ రెడ్డిని జైలులో ఉంచింది. అటు తరువాత 2012 మార్చి 12న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. తల్లిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా నియమించారు. అది మొదలు 2018 వరకు ఆమె అదే పదవిలో కొనసాగారు. అయితే తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టడంతో ఆమెకు అండగా నిలిచేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు పదవిని వదులుకున్నారు.
అయితే షర్మిల రాజకీయంగా ఎదిగే అవకాశాలు లేకపోవడంతో విజయమ్మ మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఉన్న ఆమె ఏపీకి వచ్చారు. కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకున్నారు. ఏపీకి చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ పతనం కావడం.. జాతీయ స్థాయిలో సైతం కాంగ్రెస్ ప్రభావం చూపకపోవడంతో విజయమ్మ సైతం మౌనం దాల్చారు. షర్మిల రూపంలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిందని ఆమె ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గౌరవ అధ్యక్షురాలు పదవి తీసుకోవాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది.
అయితే ఒక్క విజయమ్మే కాదు వైయస్సార్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. కుటుంబంలో చీలిక వస్తే కడప జిల్లాలో ఏ స్థాయిలో ప్రభావం చూపిందో వారికి అర్థమయింది. అనవసరంగా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చామని వారు లోలోపల బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే పాత విషయాలను మరిచి జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా అండగా నిలిచేందుకు డిసైడ్ అయినట్లు సమాచారం. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి విధేయులు ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నారు. వారు సైతం కలిసి ఉంటే కలదు సుఖం అని వైయస్సార్ కుటుంబ సభ్యులకు నచ్చ చెబుతున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలో విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారని తెలుస్తోంది. ఇలా వచ్చిన వెంటనే ఆమెకు గౌరవ అధ్యక్షురాలుగా నియమించడానికి కసరత్తు పూర్తయినట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.