చింతమనేని ప్రభాకర్.. ఏపీలో ఎంతో ప్రాచుర్యం పొందారు ఈయన. కొందరు గుండా అంటారు. మరికొంతరు రౌడీ అంటారు. ఇంకొందరు ప్రజానాయకుడు అంటారు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం ఆయన చెడ్డవాడు అంటారు. అలా అయితే ఆయన ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచినట్టు అని ప్రశ్నించిన వారు ఉన్నారు. కానీ ప్రభాకర్ చౌదరి వ్యవహార శైలి మామూలుగా ఉండదు. దూకుడుగా ఉంటారు. చత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు చెప్పినట్టు రాజకీయం, రౌడీయిజం ఒక్కటి కాదురా రేయ్.. అనే డైలాగుకు విరుద్ధంగా ఉంటుంది ప్రభాకర్ శైలి. రాజకీయానికి కాస్త రౌడీయిజం జత చేస్తారు. తరచూ వివాదాల్లో చిక్కుకుంటారు. పోలీస్ కేసులకు గురవుతుంటారు. అయితే ఈసారి దెందులూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు చింతమనేని ప్రభాకర్. అంతా సైలెంట్ గా ఉంటున్న తరుణంలో ఈరోజు సోషల్ మీడియాలో ఆయన రౌడీయిజం మరోసారి వెలుగులోకి వచ్చింది. విపరీతంగా వైరల్ అవుతుంది.
నియోజకవర్గంలో ఓ వివాహ వేడుకలకు హాజరయ్యారు దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. అదే వేడుకలకు తన ప్రత్యర్థి, మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి వచ్చారు. ఈ నేపథ్యంలో కారు పార్కింగ్ విషయంలో అబ్బాయి చౌదరి డ్రైవర్ తన వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. దీంతో చింతమనేని తిట్ల దండకాన్ని అందుకున్నారు. అమ్మ నా బూతులతో వాయించేశారు. అంతటితో ఆగని టిడిపి నేతలు సదరు డ్రైవర్తో పాటు కార్యకర్తలపై దాడి చేసినట్లు ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.
ఎంపీపీగా ఉన్న చింతమనేని ప్రభాకర్ ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారు. కానీ నిత్యం నోటి నుంచి బూతులు రావడం.. ప్రజలతో పాటు ప్రత్యర్థులపై విరుచుకు పడడం ఆయనకు అలవాటైన విద్య. 2014లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచారు చింతమనేని. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ తరుణంలో ఇసుక అక్రమ దందాను అడ్డుకున్నారు తహసిల్దార్ వనజాక్షి. దీంతో చింతమనేనికి చిర్రెత్తుకొచ్చింది. వెంటనే రంగంలోకి దిగిపోయారు. ఆమెపై దాడి చేశారు. అప్పట్లో ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కానీ అప్పటి సీఎం చంద్రబాబు చింతమనేని పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా తహసిల్దార్ వనజాక్షి తప్పు చేసినట్లు ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో సైతం చింతమనేని కి టికెట్ ఇచ్చారు.
మొన్న ఆ మధ్యన కోడిపందాలలో కూడా చింతమనేని ప్రభాకర్ పేరు ప్రముఖంగా వినిపించింది. పైగా చింతమనేని వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని అంతా భావించారు. గతం మాదిరిగా రౌడీయిజం చెలాయించడం లేదని కూడా ప్రచారం నడిచింది. కానీ అదంతా తప్పని తేలిపోయింది. ఇప్పటికీ చింతమనేని ప్రభాకర్ అదే తీరున వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులపై ఆయన వాడుతున్న పదప్రయోగం.. తిట్ల దండకం అభ్యంతరకరంగా ఉంది. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఉంది. ఆయనను కట్టడి చేయకుంటే మాత్రం అది చంద్రబాబుకి నష్టం. ఈరోజు వైసీపీ నేతలు అయ్యారు? రేపు జనసేన నేతలు ఎందుకు కారు? కానీ అదే పరిస్థితి వస్తే మాత్రం చింతమనేని మూలంగా కూటమిలో విచ్ఛిన్నం రావడం ఖాయం.