ఐదేళ్లపాటు ఆ యువ నేత పార్టీ కోసం కృషి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లో పార్టీని నిలబెట్టారు. కేడర్ కు అండగా నిలిచారు. సమస్యాత్మకమైన ఆ సెగ్మెంట్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కచ్చితంగా గెలిచే ఆ సీటును చివరి నిమిషంలో త్యాగం చేశారు. హై కమాండ్ ఒత్తిడి చేయడంతో చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు. కూటమి అభ్యర్థి విజయానికి కృషి చేశారు. కానీ ఆయన కృషికి తగ్గ ఫలితం దక్కలేదు. పైగా ఆ యువనేతను బలిపశువు చేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరు ఆ నేత? ఏంటా కథ? తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ.
ఉమ్మడి కడప జిల్లాలో జమ్మలమడుగు కీలక నియోజకవర్గం. రాజకీయాల్లో ఎప్పుడూ ఈ నియోజకవర్గం ప్రత్యేకమైనదే. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. పార్టీ ఏదైనా నాయకుడి కోసం కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చే వరకు ఉంటుంది ఇక్కడ పరిస్థితి. తమ నేత కోసం ఎంత దాకా అయినా వెళ్తారు అక్కడ. నాయకుల సైతం కేడర్ను కాపాడుకునేందుకు అంతే పట్టుదలతో నిలబడతారు. అయితే ఆ నియోజకవర్గంలో టిడిపి యువ నేత భూపేష్ రెడ్డికి అన్యాయం జరిగిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజకీయంగా తనను బలిపశువు చేశారన్న ఆవేదన ఆయనలో ఉంది. జమ్మలమడుగు ప్రస్తుత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి స్వయానా అన్న కుమారుడు భూపేష్ రెడ్డి.
2014లో వైసీపీ నుంచి గెలిచారు ఆదినారాయణ రెడ్డి. కానీ కొద్ది రోజులకే టిడిపిలోకి ఫిరాయించారు. అయితే అప్పటికే టిడిపిలో ఆదినారాయణ రెడ్డి ప్రత్యర్థి రామసుబ్బారెడ్డి ఉన్నారు. కానీ చంద్రబాబు తనదైన రాజకీయంతో ఆదినారాయణ రెడ్డిని టిడిపిలోకి రప్పించి మంత్రి పదవి ఇచ్చారు. రామసుబ్బారెడ్డి కి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సర్ది చెప్పారు. కానీ 2019 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి ఓడిపోయారు. దీంతో రామ సుబ్బారెడ్డి వైసీపీలో చేరిపోయారు. బిజెపిలోకి ఆదినారాయణ రెడ్డి వెళ్లిపోయారు. ఆ సమయంలోనే పార్టీకి నేను ఉన్నాను అంటూ ముందుకు వచ్చారు భూపేష్ రెడ్డి. దీంతో పార్టీ ఇన్చార్జిగా యువనేత భూపేష్ 5 ఏళ్లు కొనసాగారు. పార్టీ బలోపేతానికి ఎంతగానో కృషి చేశారు. 2024 ఎన్నికల్లో జమ్మలమడుగు టిక్కెట్ భూపేష్ రెడ్డికి వస్తుందని అంతా భావించారు. అయితే చివరి నిమిషంలో సీన్ మారింది. చంద్రబాబు వ్యూహాత్మకంగా జమ్మలమడుగు అసెంబ్లీ సీటును బిజెపికి కేటాయించారు.
అయితే ఐదేళ్లపాటు పార్టీ కోసం కృషి చేసిన భూపేష్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీరు మున్నేరుగా విలపించారు. అయినా సరే పొత్తుల లెక్కల్లో బిజెపికి ఆ సీటు వెళ్లిపోయింది. దీంతో చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేశారు. భూపేష్ రెడ్డిని కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయించారు. అప్పట్లో ఆదినారాయణ రెడ్డి కోసం భూపేష్ రెడ్డిని బలిపశువుగా చేశారన్న కామెంట్స్ వినిపించాయి. అయితే వైయస్ అవినాష్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చారు భూపేష్ రెడ్డి. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. కడప పార్లమెంట్ స్థానంలో సైతం గణనీయమైన ఓట్లు సాధించారు. కానీ టిడిపి హై కమాండ్ ఆయనను గుర్తించకపోవడంతో తీవ్ర అసంతృప్తికి లోనవుతున్నారు.
కూటమి అధికారంలోకి రావడంతో తనకు పదవి ఖాయమని భూపేష్ రెడ్డి భావించారు. రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి ఇస్తారని అంచనా వేశారు. ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని కూడా భావించారు. కానీ అవేవీ లేకుండా పోయాయి. పైగా బాబాయ్ అబ్బాయిల మధ్య కోల్డ్ వార్ ప్రారంభమైనట్లు ప్రచారం నడుస్తోంది. మద్యం దుకాణాల ఏర్పాటు వ్యవహారంలో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు సమాచారం. ఒకవైపు పార్టీ హై కమాండ్ పట్టించుకోకపోవడం.. మరోవైపు బాబాయ్ సైతం తొక్కి పెట్టాలని ప్రయత్నిస్తుండడంతో భూపేష్ రెడ్డి తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్టు సమాచారం