ఏపీలో రెడ్ బుక్ పక్కాగా అమలవుతున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదు అవుతున్న కేసులు, అరెస్టుల తీరు చూస్తుంటే ఇట్టే అర్థమవుతోంది. తాము అధికారంలోకి వస్తే అందరి పని పడతామని హెచ్చరిస్తూ లోకేష్ రెడ్ బుక్ రాసుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా టిడిపి నేతలను వేధించిన వారిని వదిలి పెట్టమని తీవ్ర స్థాయిలో హెచ్చరించిన సంగతి విధితమే. అందుకే మొన్నటి వరకు కేసుల నమోదు జరుగగా.. ఇప్పుడు ఏకంగా అరెస్టుల పర్వం ప్రారంభం అయింది.
తాజాగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్ళిన ప్రత్యేక బృందం ఈరోజు ఆయనను అరెస్టు చేయగలిగింది. అయితే టిడిపి కార్యాలయం పై దాడి కేసులో న్యాయస్థానంలో పిటిషన్ పెండింగ్లో ఉంది. దీంతో తనను ఎలా అరెస్టు చేస్తారని వంశీ పోలీసులను ప్రశ్నించారు. అయితే తాము వేరే కేసులో అరెస్టు చేస్తున్నామని చెప్పిన పోలీసులు హైదరాబాద్ నుండి విజయవాడ తీసుకొస్తున్నారు. అయితే రాజు తలచుకుంటే కొరడా దెబ్బలకు కొదువ అన్నట్టు ఇప్పుడు కూటమి సర్కార్ పరిస్థితి ఉంది. వరుసగా అరెస్టులు తప్పవని స్పష్టమైన హెచ్చరికలు పంపింది ప్రభుత్వం.
వల్లభనేని వంశీ మోహన్ 2019 ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచారు. కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. అయితే ఈ ఐదేళ్లపాటు చంద్రబాబుతో పాటు లోకేష్ ను టార్గెట్ చేసుకున్నారు. వ్యక్తిగత విమర్శలకు సైతం దిగేవారు. అందుకే లోకేష్ తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం వల్లభనేని వంశీని అరెస్టు చేస్తామని.. సినిమా తరహాలో అరెస్టు పర్వం నడుస్తుందని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. అందుకు తగ్గట్టుగానే ఈరోజు హైదరాబాదు నుండి వల్లభనేని వంశీని అదే మాదిరిగా తీసుకొస్తున్నారు.
ఇంకోవైపు కొడాలి నాని అరెస్టు కూడా ఉంటుందని ప్రచారం నడుస్తోంది. కొడాలి నాని చంద్రబాబు పట్ల సింహస్వప్నంగా ఉండేవారు. లోకేష్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. అయితే ఈ ఎన్నికల్లో గుడివాడ నుంచి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కనిపించకుండా మానేశారు. వల్లభనేని వంశీని అరెస్టు చేయడంతో.. కొడాలి నాని పై సైతం ఏదో ఒక కేసు పెట్టి అరెస్టు చేస్తారని ప్రచారం ప్రారంభం అయింది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టిడిపి నేతలను అరెస్టు చేశారని అప్పట్లో గగ్గోలు పెట్టారు చంద్రబాబు. కానీ ఇప్పుడు లోకేష్ రెడ్ బుక్ లో భాగంగా వైసీపీ కీలక నేతల అరెస్టు పర్వం ప్రారంభం కావడం విశేషం. అయితే డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ అరెస్టులని వైసిపి ఆరోపిస్తోంది.
అయితే కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ పై కేసులు, అరెస్టులను ముందుగానే ఊహించింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ ఇద్దరు నేతలు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నారు. త్వరలో పార్టీలో యాక్టివ్ అవుతారని ప్రచారం నడిచింది. ఇంతలోనే వారిని అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడం విశేషం. అయితే ఒక్క కొడాలి నాని, వల్లభనేని వంశీ కాదు. చాలామంది నేతలను అరెస్టు చేసేందుకు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది.