ఉత్తరాంధ్ర వైసీపీకి కొత్త బాస్ వచ్చారు. మూడు ఉమ్మడి జిల్లాల సమన్వయకర్తగా మాజీమంత్రి కురసాల కన్నబాబును ఎంపిక చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో గత కొంతకాలంగా ఈ పదవి ఖాళీగా ఉంది. అనేక తర్జనభర్జనల నడుమ చివరకు కురసాల కన్నబాబు పేరును ఖరారు చేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత విధేయుడుగా కన్నబాబుకు పేరు ఉంది. అందుకే కీలకంగా భావిస్తున్న ఉత్తరాంధ్ర పార్టీ బాధ్యతలను ఆయనకు అప్పగించినట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్చార్జిగా ఉన్న విజయసాయిరెడ్డి కొద్దిరోజుల కిందట రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పార్టీ సభ్యత్వం తో పాటు పదవులను సైతం ఆయన వదులుకున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి సైతం రాజీనామా చేశారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఉత్తరాంధ్ర బాధ్యతలు ఎవరికి వెళ్తాయి అనేది ప్రధానంగా చర్చ నడిచింది. రకరకాల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రముఖంగా మాజీమంత్రి బొత్స సత్యనారాయణ పేరు వినిపించింది. అయితే ఆయన ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాల ఇన్చార్జిగా ఉన్నారు. పైగా విశాఖ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. శాసనమండలిలో విపక్ష నేతగా కూడా ఉన్నారు. అందుకే ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా ఆయన పేరును పరిగణలోకి తీసుకోలేదు.
మరోవైపు ధర్మాన సోదరుల పేర్లు వినిపించాయి. అయితే సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పొలిటికల్ గా సైలెంట్ గా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. పార్టీలో కొనసాగుతారా లేదా అన్న చర్చ నడుస్తోంది. అటువంటి నేతకు పదవి ఇవ్వడం సముచితం కాదని జగన్మోహన్ రెడ్డి భావించారు. ధర్మాన కృష్ణ దాస్ పేరు వినిపించినా.. మూడు జిల్లాలను లీడ్ చేయలేరు అన్న టాక్ ఉంది. అందుకే ఆ ఇద్దరు పేర్లు తెరమరుగైనట్లు తెలుస్తోంది. మరోవైపు విశాఖకు చెందిన మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు వినిపించింది. అయితే ప్రత్యర్థులను టార్గెట్ చేయడమే కానీ సొంత పార్టీ శ్రేణులను కలుపు కెల్లలేరన్న విమర్శ ఆయనపై ఉంది. అందుకే ఆయన పేరును సైతం తప్పించినట్లు తెలుస్తోంది.
కురసాల కన్నబాబు ఎంపిక వెనుక జగన్మోహన్ రెడ్డి భారీ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నబాబు అయితే రాణించగలరు అన్నది జగన్మోహన్ రెడ్డి నమ్మకం. తనకు అత్యంత విధేయత కావడంతో.. అప్పగించిన బాధ్యతలు తప్పకుండా సక్రమంగా నిర్వర్తిస్తారు అన్నది జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ నమ్మకం. 2009లో ప్రజారాజ్యం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కన్నబాబు. 2014లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. 2016లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో ఆయన పోటీ చేసి ఓడిపోయారు. కాకినాడ వైసిపి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు ఏకంగా ఉత్తరాంధ్ర రీజినల్ బాధ్యతలను ఆయనకు అప్పగించడం విశేషం.