ప్రభుత్వ శాఖల్లో బేరాలు కుదరక ఫైళ్లు పెండింగ్లో ఉన్నాయా? దీనికి కారణం ఎవరు? ఆంధ్రజ్యోతి చెబుతున్నట్టు సంబంధిత శాఖ ఉన్నతాధికారులా? లేకుంటే వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి చెబుతున్నట్టు మంత్రులా? ఇప్పుడు పొలిటికల్ గా ఇదే హాట్ టాపిక్ అవుతోంది. రెండు రోజుల కిందట సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారు. మంత్రుల పనితీరును ఆధారంగా చేసుకుని ఈ ర్యాంకింగ్ కట్టబెట్టారు. అనేక రకాలుగా ఆలోచించి ఈ ర్యాంకింగ్ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అక్కడితో ఆగకుండా తమ శాఖల పరిధిలో ఫైల్ క్లియరెన్స్, శాఖల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ కట్ట పెట్టినట్లు కూడా చెప్పారు చంద్రబాబు. సీన్ కట్ చేస్తే ఆంధ్రజ్యోతిలో ప్రత్యేక కథనం వచ్చింది. శాఖల్లో ఫైళ్ళ పెండింగ్ కు మంత్రులతో సంబంధం ఉండదని.. అది ఆ శాఖ కార్యదర్శిల పని అంటూ తేల్చి చెప్పింది. అవినీతి మరక మంత్రులకు అంటకుండా ఉండే ప్రయత్నం చేసింది. అంటే మంత్రులకు తెలియకుండా ఆ శాఖలో అవినీతి జరుగుతోందని చెప్పుకొచ్చింది. ఇది నమ్మడానికి సాధ్యమా?
మరోవైపు వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒక సంచలన ఆరోపణ చేశారు. ప్రభుత్వంలో బేరాలు కుదరక సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకింగ్స్ ఇచ్చారని ప్రధాన ఆరోపణ. అది మొదలు మిథున్ రెడ్డి పై కూటమి పార్టీలు కత్తి కట్టాయి. మూడు పార్టీల ఎంపీలు మిథున్ రెడ్డి పై విరుచుకుపడుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతిపై ఈనాడు కథనాలు రాయడంతో తట్టుకోలేకపోయిన మిధున్ రెడ్డి.. మార్గదర్శిపై విమర్శలు చేశారని తిరిగి ఆరోపించడం ప్రారంభించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకే మిధున్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్కు దిగుతున్నారని మూడు పార్టీల ఎంపీలు చెప్పుకొస్తున్నారు. అయితే పెద్దిరెడ్డి బేరాలు కుదరక ర్యాంకింగ్స్ ఇచ్చారన్న మాట అన్న తరువాత ఆంధ్రజ్యోతిలో కథనం రావడం విశేషం.
ఏ శాఖలో అయినా సంబంధిత మంత్రికి తెలిసి అన్ని వ్యవహారాలు నడవాలి. కానీ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం మాత్రం మంత్రులకు సంబంధం లేదన్నట్టు రాయడం విశేషం. చంద్రబాబు అంటే పరిపాలన దక్షుడు అన్న పేరు ఉంది. అటువంటి ప్రభుత్వంలో మంత్రులకు తెలియకుండా చీమకుట్టదు. కానీ ఫైళ్లు పెండింగ్లో ఉండిపోయాయని.. దానికి ఆ శాఖ కార్యదర్శి లే బాధ్యులని ఆంధ్రజ్యోతి కథనం రాసుకొచ్చింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతోంది. అంటే ప్రభుత్వం పని చేయడం లేదన్నట్టా? మంత్రులకు శాఖలతో సంబంధం లేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అయితే మంత్రుల ర్యాంకింగ్స్ కు.. ఫైళ్ల పెండింగును ప్రాతిపదికగా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అదే అర్థం వచ్చేలా సీఎం చంద్రబాబు కూడా మాట్లాడారు. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం ఫైళ్ల పెండింగ్నకు ఆయా శాఖల అధికారుల అవినీతి కారణమని రాసుకొచ్చింది. ఇందులో ఎంత మాత్రం మంత్రులకు సంబంధం లేదని తేల్చి చెప్పింది. తద్వారా మిథున్ రెడ్డి ఆరోపణలకు పరోక్షంగా సంకేతాలు పంపగలిగింది. ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనంతో ప్రజలకు సైతం దీనిపై క్లారిటీ వచ్చింది. మొత్తానికైతే మంత్రుల ర్యాంకింగ్స్ కు.. ఫైళ్ళ పెండింగునకు దగ్గర సంబంధం ఉండడం విశేషం