సంక్షేమ పథకాలకు చంద్రబాబు సిద్ధంగా లేరా? ఉచితాలు ప్రమాదమని హెచ్చరిస్తున్నారా? ఢిల్లీలో ఫలితాలను ఏపీకి ఆపాదిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఓడిపోయారు. మూడోసారి అధికారంలోకి రావాలన్న ఆయన ప్రయత్నాన్ని బిజెపి అడ్డుకుంది. 27 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బిజెపి అక్కడ అధికారంలోకి రాగలిగింది. అయితే అక్కడ అరవింద్ కేజ్రీవాల్ ఉచిత పథకాలకు ప్రజలకు అర్థమయ్యేనాటికి పదేళ్ల సమయం పట్టిందని.. కానీ ఏపీలో మాత్రం ఐదు సంవత్సరాలకే ప్రజలకు అర్థమయిందని.. అందుకే జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడించారని చంద్రబాబు విశ్లేషణగా చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఎన్నికల్లో గెలిచేందుకు చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. చాలా రకాల హామీలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి కంటే రెట్టింపు సంక్షేమాన్ని అమలు చేస్తానని చెప్పుకొచ్చారు. అవసరమైతే సంపద సృష్టిస్తానని కూడా తేల్చి చెప్పారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం హామీలు అమలు చేస్తానని గట్టిగానే చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాననే కదా. కానీ ఇప్పుడు మడత పేచి వేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ తో జగన్మోహన్ రెడ్డిని పోల్చి.. ఏపీ ప్రజలు ముందుగానే జగన్ ను ఓడించారని చెబుతున్నారు. కానీ అదే జగన్ కంటే తాను ఎక్కువ సంక్షేమ పథకాలు ప్రకటించాను అన్న విషయాన్ని మాత్రం మరిచిపోయారు.
జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఒక ప్రకటన చేశారు. ఇప్పటివరకు తనలో జగన్ 1.0 ను చూశారని.. అది ప్రజల కోసమేనని.. కానీ ఇకనుంచి జగన్ 2.0 చూస్తారని చెప్పుకొచ్చారు. పార్టీలో నేతలతో పాటు కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తానని తేల్చి చెప్పారు. దానిని కూడా తప్పుపడుతున్నారు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని కోల్పోయారు. ఒక రాజకీయ పార్టీ నేతగా తన పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తానని చెబుతున్నారు. రేపు అధికారంలోకి వస్తే ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇస్తున్నారు. దానిని తప్పు పట్టడం ఎందుకు? 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చంద్రబాబు ఇదే తరహా హామీ ఇచ్చారు కదా. దారుణ ఓటమి ఎదురయ్యేసరికి చెదిరిపోయిన పార్టీ శ్రేణులకు అండగా నిలిచేందుకు ఇటువంటి ప్రకటనలే చేశారు కదా? కానీ ఈ విషయాలను మరచి జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు విమర్శించడం ఆశ్చర్యం వేస్తోంది.
ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. కానీ ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. చంద్రబాబు భయానికి, ఆందోళనకు అదే కారణం. కానీ దానిని మరిచి జగన్మోహన్ రెడ్డి ఆందోళన చెందుతున్నారని తనదైన స్టైల్ లో చెబుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి 2.0 ప్రకటన వచ్చిందో రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే రోడ్డుపైకి వస్తున్నాయి. చంద్రబాబు ఆందోళనకు అదే ప్రధాన కారణం. జగన్మోహన్ రెడ్డి ఆందోళన పడుతున్నారు అని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం