Jagan:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైస్సార్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత పలువురు నేతలు పార్టీని వీడి వెళ్లారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. వైసీపీని క్షేత్రస్దాయి నుంచి అభివృద్ధి చేసుకునే క్రమంలో జగన్ మరిన్ని నిర్ణయాలు ప్రకటించారు. ఇందులో భాగంగా కీలక పదవులకు నియామకాలు జరిగాయి. రెండు జిల్లాలకు అధ్యక్షులతో పాటు పలు విభాగాలకు నియామకాలు చేపడుతూ వైసీపీ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో మాజీ అదనపు అడ్వకేటా్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి ప్రమోషన్ కూడా లభించింది. జగన్ ఆదేశాలనుసారం కర్నూలు జిల్లాకు వైసీపీ అధ్యక్షుడిగా ఎస్వీ మోహన్‌రెడ్డి, నంద్యాలకు పార్టీ అధ్యక్షుడిగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి నియామకం అయ్యారు.
అదే విధంగా వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా వేణుగోపాల్ కృష్ణ మూర్తి (చిట్టి బాబు), పార్టీ నిర్మాణ సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయి దత్‌ను నియమిస్తున్నట్లు కేంద్ర కార్యాలయం పేర్కొంది. అలాగే వైసీపీలో 41 అనుబంధ విభాగాలకు అధ్యక్షుల్ని కూడా నియమిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా వచ్చే ఐదేళ్ల పాటు పార్టీని నిలబెడతామన్న గట్టి పట్టుదలతో ఉన్న జగన్.. కూటమి ప్రభుత్వాన్ని ధీటైన రీతిలో ఎదుర్కొనే బలవంతులైన నాయకులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.