వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో పదవులు పొందిన వారు చాలామంది ఉన్నారు. ఆర్థికంగా లబ్ధి పొందిన వారు కూడా ఉన్నారు. అటువంటి వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. అధినేత జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసి మరి బయటికి వెళ్లిపోతున్నారు. అటువంటి నేతల్లో జోగి రమేష్ ఒకరు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. వందలాది కార్లతో చంద్రబాబు ఇంటిపై దండయాత్ర చేశారు. దాడి చేసినంత ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు అదే జోగి రమేష్ చంద్రబాబు చెంతకు చేరిపోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.
జోగి రమేష్ కు రాజకీయ జీవితాన్ని ప్రసాదించారు రాజశేఖర్ రెడ్డి. ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి మంత్రిగా అవకాశం ఇచ్చి ప్రోత్సహించారు. ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా రాజకీయంగా చేయూతనందించారు. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే.. తన ప్రయోజనాలు చూసుకుంటున్నారు జోగి రమేష్. అధికారంలో ఉన్న ఐదేళ్లు పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన.. ఇప్పుడు కేసుల భయంతోనే టీడీపీలో చేరడానికి తెగ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత జోగి రమేష్ మౌనవ్రతం పట్టారు. మూడుసార్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. కానీ అధినేత ప్రోత్సాహాన్ని మరిచిపోయారు. కేవలం తనకోసమే ఇన్నాళ్లు విధేయత ప్రదర్శించారని అర్థమవుతోంది. 2014లో సొంత నియోజకవర్గం మైలవరం నుంచి పోటీ చేసిన జోగి రమేష్ దేవినేని ఉమా చేతిలో ఓడిపోయారు. మైలవరంలో జోగి రమేష్ గెలుపు అసాధ్యమని భావించిన జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో పెడనకు షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి గెలిచేసరికి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు.
గత ఐదేళ్లలో పెడన నియోజకవర్గంలో జోగి రమేష్ నిర్వాకంతో వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. దీంతో జగన్ మోహన్ రెడ్డి జోగి రమేష్ ను పెనమలూరు కు షిఫ్ట్ చేశారు. అయితే అక్కడ కూడా జోగి రమేష్ కు ఓటమి తప్పలేదు. అయితే కృష్ణాజిల్లాలో ఏ ఒక్క నేత గడప దాటలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వద్ద అన్ని రకాల ప్రయోజనాలు పొందిన జోగి రమేష్ మాత్రం ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధపడి పోతున్నారు. కానీ అక్కడ చిన్న బాస్, పెద్ద బాస్ నో ఎంట్రీ బోర్డు పెట్టేసారట. దీంతో పొలిటికల్ జంక్షన్ లో నిలబడ్డారు జోగి రమేష్.