Tuesday, April 22, 2025

ఏపీలో కూటమికి వ్యతిరేకంగా హైదరాబాదులో కమ్మ సామాజిక వర్గం భేటీ

- Advertisement -

చంద్రబాబును వ్యతిరేకించే కమ్మ నేతలు ఏకమవుతున్నారా? హైదరాబాద్ వేదికగా త్వరలో ఓ సమావేశం జరగబోతుందా? కూటమిలో కమ్మ సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని బలమైన చర్చ జరుగుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం అంటే తెలుగుదేశం ఒక్కటే కాదు. తెలుగుదేశం నాయకత్వాన్ని వ్యతిరేకించే చాలామంది నేతలు ఉన్నారు. అటువంటి వారంతా ఏకతాటిపైకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరూ సినీ ప్రముఖులు సైతం వారితో చేతులు కలుపుతున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మాజీ మంత్రి కొడాలి నాని ఆసుపత్రిలో ఉన్నారు. గుండె సంబంధిత సమస్యలతో ముంబైలోని ఓ పేరు మోసిన ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం పై రకరకాల ప్రచారం నడుస్తోంది. మరోవైపు వల్లభనేని వంశీ మోహన్ జైల్లోనే ఉన్నారు. ఎప్పుడు విడుదలవుతారో తెలియని పరిస్థితి. పోసాని కృష్ణ మురళి జైలుకెళ్లి బెయిల్ పై బయటకు వచ్చారు. వారంలో రెండుసార్లు సిఐడి కార్యాలయానికి వెళ్లి సంతకం పెట్టి వస్తున్నారు.

అయితే ఏపీ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడాన్ని ఆ సామాజిక వర్గం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కమ్మ సామాజిక వర్గానికి అన్ని విధాలుగా అండదండలుగా నిలుస్తోంది. కానీ ఏపీలో మాత్రం కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసింది కూటమి ప్రభుత్వం. కేవలం తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయకత్వాన్ని ఎదిరించారన్న ఒకే ఒక కారణంతో వెంటాడుతోంది. ఇది ఆ సామాజిక వర్గంలో కొత్త ఆలోచనకు తెరతీసింది.

హైదరాబాదులో కమ్మ సామాజిక వర్గం ప్రముఖులు అధికం. మొన్నటి ఎన్నికల్లో వారు కూటమికి మద్దతుగా పనిచేశారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోని కమ్మ సామాజిక వర్గం నేతలను మాత్రమే టార్గెట్ చేస్తుండడాన్ని వారు తప్పుపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో చాలామంది ఇతర సామాజిక వర్గం నేతలు సైతం దూకుడుగా ఉండేవారు. వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.. వారి విషయంలో ఎందుకు దూకుడుగా వెళ్లడం లేదు అన్నది కమ్మ ప్రముఖుల ప్రశ్న. అయితే ఇతర సామాజిక వర్గాల విషయంలో పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అవుతుందని.. అదే సమయంలో కమ్మ సామాజిక వర్గం విషయంలో చంద్రబాబు మాట చెల్లుబాటు కావడం లేదన్నది ఒక వాదన.

కూటమి ప్రభుత్వంలో ఒక పద్ధతి ప్రకారం కమ్మ సామాజిక వర్గం పై దాడులు, కేసులు పెరుగుతున్నాయి అన్నది ఒక వాదన. పైగా కమ్మ సామాజిక వర్గం నేతలకు నామినేటెడ్ పదవులు కూడా అంతంత మాత్రమే దక్కుతున్నాయి. రాజ్యసభ తో పాటు ఎమ్మెల్సీ పదవుల విషయంలో చంద్రబాబు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అదే ఇతర సామాజిక వర్గాల విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు అవుతోంది. అదే కమ్మ సామాజిక వర్గం ప్రముఖుల్లో ఆందోళనకు కారణం.

తాజాగా కమ్మ సామాజిక వర్గం విషయంలో జరుగుతున్న పరిణామాలు చర్చించేందుకు హైదరాబాద్ కేంద్రంగా కమ్మ ప్రముఖులు ఒక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దీనికి టాలీవుడ్ స్టార్ హీరో తో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సైతం తరలివస్తారని తెలుస్తోంది. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు ఒకే తాటిపైకి వచ్చి చర్చిస్తారని సమాచారం. మరి అక్కడ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!