ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి పది నెలలు అవుతోంది. ఇప్పటివరకు రెండు సార్లు నామినేటెడ్ పదవులను భర్తీ చేశారు. మూడు రాజ్యసభ స్థానాలను భర్తీ చేశారు. 8 ఎమ్మెల్సీ పదవులను సైతం పంపకాలు చేశారు. కానీ ఒక్కటంటే ఒక్క పదవి కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వలేదు. దీంతో ఆ సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ వెంట అడుగులు వేసింది రెడ్డి సామాజిక వర్గం. 2014, 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడింది. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమైంది రెడ్డి సామాజిక వర్గం. కానీ గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో బీసీలతో పాటు ఇతర సామాజిక వర్గాలకు పెద్దపీటవేశారు. కేవలం తన సొంత సామాజిక వర్గానికి ప్రయారిటీ ఇస్తున్నారు అన్న విమర్శలకు చెక్ చెప్పేందుకు రెడ్డి సామాజిక వర్గం విషయంలో జగన్మోహన్ రెడ్డి గత మాదిరిగా అనుకూల నిర్ణయాలు తీసుకోలేకపోయారు. దాని ప్రభావం రాయలసీమలో స్పష్టంగా కనిపించింది. రెడ్డి సామాజిక వర్గం సైలెంట్ అయ్యే సరికి కూటమికి కలిసి వచ్చింది.
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రెడ్డి సామాజిక వర్గంపై వివక్ష కొనసాగుతోంది. అస్సలు వారిని రాజకీయంగా పరిగణలోకి తీసుకోవడం లేదు. పదవుల విషయంలో పెద్దపీట వేయడం లేదు. నామినేటెడ్ పదవుల్లో అయితే అప్రధాన్య పోస్టులు ఇచ్చారు. ఎమ్మెల్సీ పదవులు ఇవ్వలేదు. రాజ్యసభ పదవులకు పరిగణలోకి తీసుకోలేదు.
ఈసారి రెడ్డి సామాజిక వర్గంలోని చాలామంది నేతలు కూటమి గూటికి వచ్చారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన కిరణ్ కుమార్ రెడ్డి లాంటి నేత కూడా కూటమిలోకి వచ్చారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే రెడ్డి సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయంగా అవకాశాలు ఇవ్వకూడదని చంద్రబాబు భావిస్తున్నట్లు ఉన్నారు. అందుకే వారికి ఎటువంటి పదవులు ఇవ్వడం లేదు.
అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటును మాత్రం రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. ఆ పదవిని కిరణ్ కుమార్ రెడ్డికి కానీ.. విష్ణువర్ధన్ రెడ్డికి కానీ ఇవ్వాలన్న డిమాండ్ రాయలసీమ నుంచి వస్తోంది. లేకుంటే మాత్రం కూటమి ప్రభుత్వంపై పోరాటం చేయాలని రెడ్డి సామాజిక వర్గం ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అదే జరిగితే కూటమికి ప్రమాదకరమే.