Tuesday, April 22, 2025

టిడిపిలో అసంతృప్తితో కోట్ల ఫ్యామిలీ

- Advertisement -

తెలుగుదేశం పార్టీలో కోట్ల కుటుంబం అసంతృప్తిగా ఉందా? సరైన గౌరవం దక్కడం లేదని భావిస్తోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి.

ఏపీలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాల్లో కోట్ల కుటుంబం. కర్నూలు జిల్లా రాజకీయాలనే శాసించారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. రాయలసీమ జిల్లాలను తన కను సన్నల్లో ఏలారు. 1995లో ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. రెండుసార్లు కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ గా పని చేశారు. మొత్తం ఐదు సార్లు శాసనసభకు, ఆరుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా కూడా పదవీ బాధ్యతలు చేపట్టారు.

ఉమ్మడి ఏపీకి 1982 సెప్టెంబర్ 20న ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి. 1992లో రెండోసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు. ఉమ్మడి ఏపీలో తనకంటూ గుర్తింపు సాధించుకున్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి.

తండ్రి రాజకీయాల్లో ఉన్నప్పుడే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. 1991లో తొలిసారిగా లోక్సభ సభ్యుడు అయ్యారు. 2004లో రెండోసారి కర్నూలు పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో మూడోసారి గెలిచిన కోట్ల మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో కేంద్ర మంత్రి అయ్యారు.

2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారింది. అయినా సరే అదే పార్టీలో కొనసాగుతూ వచ్చారు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి. కానీ 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయన భార్య సైతం ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చవి చూశారు.

2024 ఎన్నికల్లో టిడిపి అధినేత చంద్రబాబు కోట్ల కుటుంబానికి హ్యాండ్ ఇచ్చారు. కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మాత్రమే టికెట్ ఇచ్చారు. ఆయన అడిగిన కర్నూలు పార్లమెంట్ టికెట్ కాకుండా.. డోన్ అసెంబ్లీ సీటు ఇచ్చారు. అయీష్టత గానే పోటీ చేశారు సూర్య ప్రకాశ్ రెడ్డి. ఒకానొక దశలో కన్నీటి పర్యంతం అయ్యారు.

అయితే డోన్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి మంత్రి పదవి ఆశించారు. కానీ ఆయన పేరును కనీసం పరిగణలోకి తీసుకోలేదు. శాసనసభ్యుడిగా కూడా పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయనలో ఉంది. తాను ఎంపీగా ఉండి కేంద్ర రాజకీయాల్లో ఉంటాననుకుంటే.. చంద్రబాబు కట్టడి చేయడానికి జీర్ణించుకోలేకపోతున్నారు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి. కేవలం టిడిపిలో ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం అవుతున్నానన్న బాధతో ఉన్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా 2029 ఎన్నికలకు ముందు ఆయన కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!