Tuesday, April 22, 2025

జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కోసం జనసేన పట్టు

- Advertisement -

ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో కూటమి పరిస్థితి. ఇంకా కూటమికి కార్పొరేటర్ల బలం చిక్కలేదు. మేయర్ పై అవిశ్వాసం నెగ్గేందుకు సరిపడా బలం కూటమికి లేదు. కానీ మేయర్ పదవి తామే తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ చెబుతోంది. అయితే తమ బలం కూడా జీవీఎంసీలో పెరిగిందని.. తమకు కూడా పదవులు ఇవ్వాల్సిందేనని జనసేన డిమాండ్ చేస్తోంది. దీంతో ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ వర్సెస్ కూటమి అన్న పరిస్థితి.. ఇప్పుడు పదవుల కోసం టిడిపి వర్సెస్ జనసేన అన్నట్టు పరిస్థితి మారింది.

గ్రేటర్ విశాఖ మేయర్ గొలగాని వెంకట హరి కుమారి పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి డిసైడ్ అయింది. బీసీ మహిళ.. ఆపై యాదవ సామాజిక వర్గానికి చెందిన ఆమె గత నాలుగేళ్లుగా జీవీఎంసీలో సమర్థవంతమైన పాలన అందిస్తూ వచ్చారు. అయినా సరే కూటమి ఎట్టి పరిస్థితుల్లో మేయర్ ను గద్దె దించి ఆ స్థానంలో తమ పార్టీలకు చెందిన నేతను నియమించాలని ఉవ్విల్లూరుతోంది. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్కు వినతిపత్రం అందించింది. ఈ నెల 19న అవిశ్వాస తీర్మానం ఉంటుందని ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ప్రత్యేక శిబిరానికి వెళ్లారు. కూటమికి సరిపడా కార్పొరేటర్ల బలం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. కాదు కాదు తమకు ఎక్స్ ఆఫీసుయో సభ్యులతో పాటు తగినంత మంది కార్పొరేటర్ల బలం ఉందని కూటమి ప్రకటనలు చేస్తోంది.

అయితే ఇప్పుడు జనసేన సైతం తమకు పదవులు ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన కార్పొరేటర్లతో కలిపి జనసేన బలం 11 కు చేరింది. మొన్న మధ్యన మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖపట్నం వచ్చారు. తమ పార్టీ కార్పొరేటర్ లను ఏ శిబిరాలకు తరలించడం లేదని తేల్చి చెప్పారు. తమ పార్టీలో అధినేత పవన్ మాటే ఫైనల్ అని కూడా చెప్పుకొచ్చారు. క్యాంపు రాజకీయాలకు తమ పార్టీ వ్యతిరేకమని కూడా ప్రకటన చేశారు.

అయితే సీన్ కట్ చేస్తే 11 మంది కార్పొరేటర్లు ఉన్న జనసేనకు తప్పకుండా డిప్యూటీ మేయర్ పోస్టు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఏకైక డిప్యూటీ మేయర్ పోస్ట్ సైతం తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది. నాలుగు దశాబ్దాల తర్వాత జీవీఎంసీ పీఠం టిడిపి దక్కించుకుంటుందని.. ఈసారి మాత్రం డిప్యూటీ మేయర్ పోస్టు జనసేనకు ఇచ్చేది లేదని టిడిపి నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇది జనసేన నేతల్లో ఆగ్రహానికి కారణం అవుతోంది.

అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జనసేన కార్పొరేటర్ లను సైతం ప్రత్యేక క్యాంపునకు తరలించాలని ఆ పార్టీ హై కమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. విజయవాడ కానీ.. హైదరాబాద్ కానీ తరలించి.. కార్పొరేటర్ల అభిప్రాయాన్ని అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటారని.. అందుకు అనుగుణంగా ఒక వ్యూహం రూపొందిస్తారని తెలుస్తోంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో డిప్యూటీ మేయర్ పోస్టు వదిలేది లేదని జనసేన నేతలు తేల్చి చెబుతున్నారు. దీంతో ఈ అంశం యూటర్న్ తీసుకున్నట్లు అయింది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!